Telugu Gateway
Latest News

ఇసుక తుఫాన్ లో ‘వైసీపీ సర్కారు’

ఇసుక తుఫాన్ లో ‘వైసీపీ సర్కారు’
X

తెలుగుదేశం హయాంలో ఉన్నది లోపభూయిష్ట ఇసుక విధానం. మేం అత్యుత్తమ విధానం తెస్తాం. అప్పటివరకూ ఇసుక కోసం ఆగమన్నారు. పాలసీ వచ్చింది..కానీ సీజన్ పోయింది. ఇది గత ఏడాది సీన్ . కానీ ఇసుక కథ మళ్ళీ మొదటికే వచ్చింది. కొత్త పాలసీ వచ్చింది. అసలు అక్రమాలకు ఛాన్సే ఉండదు. ప్రతి లారీకి, వాహనాలకూ జీపీఎస్ పెట్టామన్నారు. ఇసుక రేణువు కూడా పక్కకు పోదన్నారు. కానీ ఏపీలో చాలా చోట్ల ఎవరికీ ఇసుక మాత్రం అందుబాటులో ఉండటం లేదు. పోనీ ఇదేదో ప్రతిపక్ష తెలుగుదేశం విమర్శలు అనుకుంటే పొరపాటే. సాక్ష్యాత్తూ అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలే బహిరంగంగా సర్కారు తీరుపై విమర్శలు చేస్తున్నారంటే ఇసుక సరఫరా పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. తాము తెచ్చిన ఇసుక పాలసీతో అసలు సమస్యలే ఉండబోవని సర్కారు అప్పట్లో గొప్పలు చెప్పుకుంది. కానీ విధానం ఏదైనా ఇసుక పక్కదారి పట్టడం అనేది కామన్ అని తేలిపోయింది.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు సమీక్ష జరిపి ‘బల్క్ ఆర్డర్లు ’ ఎత్తేయాలని..గ్రామాల్లో ఇసుక ఉచితంగానే ఇవ్వాలని సూచించారు. ఈ సీజన్ లో ఇసుకకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని అంటూ లాక్ డౌన్ సమయంలో కూడా స్టాక్ పాయింట్లకు ఇసుక తరలింపుకు సర్కారు అనుమతులు ఇచ్చింది. కానీ ఆ ఇసుక అంతా ఎటుపోయిందో ఎవరికి తెలియదు. కానీ కథ మళ్లీ మొదటికే వచ్చింది. సర్కారు నిర్ణయరాహిత్యం కారణంగా గత ఏడాదిలో ఓ సారి ఇసుక దొరక్క ప్రజలు ఇళ్ళు, ఇతర నిర్మాణాలు కూడా చేపట్టలేక నానా కష్టాలు పడ్డారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇసుక దొరకటంలేదంటే ప్రభుత్వం ‘ఇసుక తుఫాన్’ లో ఎంత మేర కూరుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఓ వైపు అసలే కరోనా కష్టాలు. అలాంటి సమయంలో ఇసుక అందరికీ అందుబాటులో ఉంచి..నిర్మాణ రంగం పనులు సాఫీగా చూడాల్సిన సర్కారు ఆ పని చేయలేకపోతుందనే విమర్శలు ఎదుర్కొంటోంది. దీని వల్ల సర్కారు ఆదాయంపై కూడా ప్రభావం పడుతుందని..ఇసుక అందుబాటులో లేక నిర్మాణాలు ఆగిపోతే స్టీల్, సిమెంట్ కొనుగోలు చేసేవారు కూడా ఉండరని..అంతిమంగా ఇది ప్రభుత్వంపై కూడా ప్రభావం చూపుతుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

దీని కంటే ముఖ్యంగా కేవలం నిర్మాణ పనులపై ఆధారపడిన వారికి ఉపాధి దొరకటం కూడా గగనం అవుతుంది. చూస్తుంటే గత అనుభవాల నుంచి సర్కారు పాఠాలేమీ నేర్చుకున్నట్లు కన్పించటం లేదనే విమర్శలు వస్తున్నాయి. గోదావరి జిల్లాలో బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇసుక వ్యవహారాలను నియంత్రిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. చాలా చోట్ల అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తుండటంతో ఇసుక అంతా పక్కదారి పడుతుందని చెబుతున్నారు. చూస్తుంటే ప్రభుత్వం ఏదైనా ఇసుక సమస్య కామనే అన్న చందంగా మారింది. టీడీపీ హయాంలో ఇసుకపై ఎన్నో విమర్శలు చేసిన వైసీపీ నేతలు తాజా పరిస్థితిపై ఒకింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది.

Next Story
Share it