Telugu Gateway
Telangana

రైతుల పేరుతో కెసీఆర్ రాజ‌కీయం

రైతుల పేరుతో కెసీఆర్ రాజ‌కీయం
X

తెలంగాణ స‌ర్కారుపై పీయూష్ గోయెల్ మండిపాటు

కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం అస‌త్య ప్ర‌చారం చేస్తోంద‌ని..వాళ్లు చెప్పేవ‌న్నీ అబద్ధాలే అన్నారు. సీఎం కెసీఆర్ రైతుల పేరుతో రాజ‌కీయం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. పంజాబ్ నుంచి ఎలా అయితే ముడి బియ్యం సేక‌రిస్తున్నామో తెలంగాణ నుంచి కూడా అలాగే సేక‌రిస్తున్నామ‌ని తెలిపారు. కేంద్రానికి ఎంత ముడి బియ్యం ఇస్తార‌ని అడిగితే ఇప్ప‌టి వ‌ర‌కూ స‌మాధానం లేద‌న్నారు. రెండుసార్లు స‌మావేశాలు ఏర్పాటు చేసినా కూడా తెలంగాణ నుంచి ఎవ‌రూ రాలేద‌న్నారు. అన్ని రాష్ట్రాల‌తో ఒకే త‌ర‌హా ఒప్పందాలు ఉన్నాయని...తెలంగాణ‌పై ఎలాంటి వివ‌క్ష లేద‌న్నారు.

సీఎం కేసీఆర్‌ రైతు వ్యతిరేకి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని దుయ్యబట్టారు. అన్ని రాష్ట్రాలు ఎఫ్‌సీఐతో ఒప్పందం చేసుకున్నాయని, తెలంగాణ మాత్రం ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదని తప్పుబట్టారు. కేసీఆర్‌ చేతకానితనాన్ని కేంద్రంపై రుద్దాలని చూస్తున్నారని, రైతులకు కేసీఆర్‌ భ్రమలు కల్పించి నష్టం చేకూరుస్తున్నారని విమర్శించారు. గతంలో కంటే ఏడున్నర రెట్లు తెలంగాణ నుంచి ధాన్యం సేకరించామని తెలిపారు. అన్ని రాష్ట్రాలు త‌మ‌కు స‌మాన‌మే అన్నారు.

Next Story
Share it