ఇక నుంచి ఎటర్నల్ లిమిటెడ్
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేరు మారుతోంది. ఇక నుంచి జొమాటో లిమిటెడ్ ను ఎటర్నల్ లిమిటెడ్ గా పిలుస్తారు. అయితే కంపెనీ పేరు మారినా కూడా జొమాటో బ్రాండ్...యాప్ మాత్రం అదే పేరుతో కొనసాగుతాయి. కంపెనీ పేరు మార్పునకు సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది. అయితే రాబోయే రోజుల్లో వాటాదారులతో పాటు ఇతర చట్ట బద్ద సంస్థల నుంచి ఆమోదం పొందిన తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. స్టాక్ మార్కెట్ లో కూడా ఈ షేర్లు రాబోయే రోజుల్లో ఎటర్నల్ లిమిటెడ్ పేరుతోనే ట్రేడ్ అవుతాయి. ప్రస్తుతం కంపెనీ పరిధిలో జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్ ప్యూర్ పేరిట వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కంపెనీ పేరు మార్పునకు సహకరించాలని కోరుతూ జొమాటో సీఈఓ, వ్యవస్థాపకుడు అయిన దీపిందర్ గోయల్ వాటాదారులకు లేఖ రాశారు.
బ్లింకిట్ ను సొంతం చేస్తుకున్నప్పటి నుంచి అంతర్గతంగా తాము కంపెనీ పేరును ఎటర్నల్ లిమిటెడ్ గా వ్యవహరిస్తూ వచ్చామని తెలిపారు. కంపెనీ బ్రాండ్, యాప్ మధ్య వ్యతాసం ఉండాలనే ఉద్దేశం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జొమాటో షేర్ 52 వారాల గరిష్ట ధర 304 రూపాయలు అయితే...కనిష్ట ధర 139 రూపాయలుగా ఉంది. గురువారం నాడు బిఎస్ఈ లో కంపెనీ షేర్లు రెండు రూపాయల నష్టంతో 229 రూపాయల వద్ద ముగిశాయి. క్విక్ కామర్స్ వ్యాపారంపై కంపెనీ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. గత కొంత కాలంగా ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్ లో ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.