2023 లో టాప్ టెన్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే
ప్రపంచంలోని కీలక ప్రాంతాలు పర్యాటకుల ఒత్తిడి తట్టుకోలేక ఏకంగా ఆంక్షలు పెట్టాల్సి వస్తోంది. కరోనా దెబ్బకు ఎటూ కదలకుండా రెండేళ్ల పాటు ఇళ్లకే పరిమితం అయిన వారు తర్వాత జూలు విదిల్చారు. దీంతో 2023 సంవత్సరంలో పలు కీలక ప్రాంతాలు పర్యాటకుల తాకిడితో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. ఒక ప్రముఖ వెబ్ సైట్ నిర్వహించిన రీసెర్చ్ లో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 2023 లో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు పోటెత్తిన ప్రాంతాల్లో థాయిలాండ్ కు చెందిన ద్వీపం ఫుకెట్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. దీని తర్వాత రెండవ, మూడవ స్థానంలో కూడా థాయిలాండ్ కు చెందిన పట్టాయా, క్రాబీలు నిలిచాయి. ఈ ప్రాంతాల్లో పర్యాటకులు పరిమితికి మించి వచ్చినట్లు అయింది అని గుర్తించారు. ప్రపంచం వ్యాప్తంగా కూడా టాప్ టూరిస్ట్ ప్లేస్ లు ఓవర్ టూరిజం తో ఇబ్బందులు పడుతున్నాయి. పలు దేశాలు టూరిస్ట్ లను నియంత్రిచేందుకు ఆంక్షలు కూడా పెడుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.
పర్యాటకుల కదలికలను నియంత్రించేందుకు బాలి లో కూడా ఆంక్షలు పెట్టారు. తాజా సర్వే ప్రకారం 2023 లో పర్యాటకులు పెద్ద ఎత్తున పోటెత్తిన ప్రాంతాలుగా థాయిలాండ్ లోని ఫుకెట్, పట్టాయా, క్రాబి, టర్కీ లోని ముగ్లా, హుర్గద, చైనాలోని మకావు, గ్రీస్ లోని హెరాక్లిన్, ఇటలీలోని వెనిస్, గ్రీస్ లోని రోడ్స్, అమెరికా లోని మియామీ లు టాప్ టెన్ ప్లేస్ లుగా నిలిచాయి. వెనిస్ లో అయితే పర్యాటకులను కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక పన్నులు కూడా విధించారు. 90 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉండే అద్భుత ద్వీపం ఫుకెట్ కు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా స్కూబా డైవర్స్ కు ఇది ఎంతో అనువైన ప్రాంతం కూడా. కరోనా తర్వాత విమాన టికెట్స్ తో పాటు హోటల్ వ్యయాలు పెరిగిన కూడా పర్యాటకులు మాత్రం ఎక్కడా వెనక్కితగ్గకుండా తమకు నచ్చిన ప్రాంతాలకు వెళుతున్నారు.