Telugu Gateway
Top Stories

షాకింగ్..122 కోట్లతో నంబర్ ప్లేట్ కొన్నారు

షాకింగ్..122 కోట్లతో నంబర్ ప్లేట్ కొన్నారు
X

వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక ప్రైవేట్ జెట్ విమానమే కొనచ్చు. పదుల సంఖ్యలో విలాసవంతమైన కార్లు వచ్చిపడతాయి. కానీ దుబాయ్ లోని సంపన్నుడు ఒకరు ఏకంగా 122 . 16 కోట్ల రూపాయలకు ఒక ఫాన్సీ నంబర్ ప్లేట్ కొన్నారు. ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధిక ధర పలికిన నంబర్ ప్లేట్ గా ఇది నిలుస్తుంది. దీంతో ఇది గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కింది. అయితే ఇంత మొత్తం ఖర్చు పెట్టిన వ్యక్తి పేరు మాత్రం రహస్యంగా ఉంచారు. ఇంత ధర పలికిన నంబర్ ప్లేట్ పీ 7 . ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మందికి ఆహారం అందించే కార్యక్రమం కోసం తలపెట్టిన పనికి ఈ నిధులను ఉపయోగిస్తారు. అందులో భాగంగానే దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ ఆథారిటీ ఈ నంబర్ల వేలం నిర్వహించింది. పీ 7 నంబర్ ప్లేట్ కు 122 . 16 కోట్ల రూపాయలు రాగా..ఇదే తరహాలో చాలా ఫాన్సీ నంబర్ ప్లేట్ లను కూడా వేలం వేశారు. ఇందులో ఏఏ 22 నంబర్ ప్లేట్ కు 18 కోట్ల రూపాయలు వచ్చాయి.

ఏఏ 19 కు పది కోట్ల రూపాయల ధర పలికింది. ఇలా పలు ఫాన్సీ నంబర్లు అమ్మకానికి పెట్టారు. గతంలో పీ 1 నంబర్ కు అబుదాబిలో అత్యధిక ధర రాగా..ఇప్పుడు ఆ రికార్డు ను పీ 7 నంబర్ తిరగరాసింది. వీఐపీలు తమకు కావాల్సిన నంబర్ కోసం ఎంత ఖర్చు పెట్టడానికి అయినా వెనకాడరు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ విషయంలో ముందు వరసలో ఉంటారు. ఇండియా లో కూడా ఈ ట్రెండ్ ఉంది. అటు బాలీవుడ్ హీరో లతో పాటు టాలీవుడ్ హీరోలు కూడా తమకు కావాల్సిన నంబర్ల కోసం భారీ మొత్తాలు వెచ్చించిన సందర్బాలు చాలానే ఉన్నాయి. కాకపోతే ఇది మాత్రం చాలా చాలా స్పెషల్. ఎందుకు అంటే ఏకంగా ప్రపంచంలోనే ఒక నంబర్ ప్లేట్ కోసం ఇంత మొత్తం ఖర్చు చేయటం ఇదే మొదటిసారి కావటం విశేషం. అందుకు ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Next Story
Share it