ప్రపంచంలోనే కాస్ట్లీ నగరంగా టెల్ అవివ్
పది ఖరీదైన నగరాల జాబితా విడుదల
జీవన వ్యయాలను పరిగణనలోకి తీసుకుని ప్రపంచంలో ఏది ఖరీదైన నగరమో గుర్తిస్తారు. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఏ నగరం ఏ ర్యాంక్ లో ఉందో ఓ నివేదిక వచ్చింది. దీని ప్రకారం ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరంగా ఇజ్రాయెల్ కు చెందిన టెలి అవివ్ మొదటి స్థానంలో నిలిచింది. సిరియాకు చెందిన డమాస్కస్ అత్యంత తక్కువ వ్యయంతో నివసించగలిగే నగరంగా గుర్తించారు. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ నగరంగా టెల్ అవీవ్ నిలవగా.. ఆ తర్వాత స్థానాల్లో పారిస్, సింగపూర్, జ్యూరిచ్, హాంకాంగ్, న్యూయార్క్ సిటీ, జెనీవా, కొపెన్ హెగెన్, లాస్ ఏంజెల్స్, ఒసాకాలు నిలిచాయి. ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ నివేదిక ఆధారంగా ఈ జాబితా సిద్ధం చేశారు.
ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 173 నగరాల్లోని ఇంటి అద్దెలు..నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా వ్యయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా సిద్ధం చేశారు. టెల్ అవివ్ తొలి సారి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరంగా చోటు సంపాదించుకుంది. పారిస్, సింగపూర్ లు రెంండూ కూడా రెండవ స్థానంలో నిలిచాయి. ఒకే పాయింట్లు రావటంతో వీటికి రెండవ స్థానం కేటాయించారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే గత ఏడాది పారిస్, జ్యూరిచ్, హాంకాంగ్ లు వరసగా అత్యంత ఖరీదైన నగరాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.