Telugu Gateway
Top Stories

వరల్డ్స్ నంబర్ వన్ హమద్ ఎయిర్ పోర్ట్

వరల్డ్స్ నంబర్ వన్ హమద్ ఎయిర్ పోర్ట్
X

గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే నంబర్ వన్ విమానాశ్రయం హోదా నిలబెట్టుకుంటున్న సింగపూర్ చాంగి విమానాశ్రయం ఈ సారి సెకండ్ ప్లేస్ లోకి వెళ్ళింది. దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ సారి ప్రపంచంలోని నంబర్ వన్ ఎయిర్ పోర్ట్ గా నిలిచింది. ఈ సారి సింగపూర్ చాంగి ఎయిర్ పోర్ట్ రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్కై ట్రాక్స్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణికుల అభిప్రాయాలు తీసుకుని ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా టాప్ ప్లేసులో ఉన్న విమానాశ్రయాల జాబితాను విడుదల చేస్తుంది. అందులో భాగంగానే 2024 సంవత్సరానికి సంబంధించి తాజాగా ఈ జాబితా విడుదల చేశారు. దీని ప్రకారం చూస్తే సియోల్ లోని ఇంచియాన్ ఎయిర్ పోర్ట్ మూడవ స్థానంలో, టోక్యోలోని హనీదా నాల్గవ స్థానంలో, నరీతా విమానాశ్రయాలు ఐదవ ప్లేస్ లో ఉన్నాయి. ఇది కూడా టోక్యో లోనే ఉంటుంది. ఆ తర్వాత స్థానాల్లో వరసగా పారిస్ కు చెందిన చార్లెస్ డి గాలే, దుబాయ్ ఎయిర్ పోర్ట్, జర్మనీలోని మ్యూనిచ్ ఎయిర్ పోర్ట్, స్విట్జర్లాండ్ కు చెందిన జ్యూరిక్ ఎయిర్ పోర్ట్, తుర్కియో లోని ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ లు టాప్ టెన్ ప్లేస్ లను దక్కించుకున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా వంద అగ్రశ్రేణి విమానాశ్రయాల జాబితాలో భారత్ కు చెందిన నాలుగు ఎయిర్ పోర్ట్ లు చోటు దక్కించుకున్నాయి. ఇందులో ఢిల్లీ కి చెందిన ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 36 స్థానంలో నిలిచింది. బెంగళూరు ఎయిర్ పోర్ట్ తన ర్యాంక్ ను 69 నుంచి 59 కి మెరుగుపరుచుకుంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ర్యాంక్ కూడా 65 నుంచి 61 కి మారింది. ముంబై లో ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయం ర్యాంక్ మాత్రం 84 నుంచి 95 పడిపోయింది. ఢిల్లీ విమానాశ్రయం దక్షిణాసియా లోనే అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచింది. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే అగ్ర రాజ్యం అమెరికాకు చెందిన ఏ ఒక్క విమానాశ్రయానికి కూడా ఈ జాబితాలో లోని టాప్ ట్వంటీ ఎయిర్ పోర్ట్స్ లో చోటు దక్కపోవటం విశేషం.

Next Story
Share it