Telugu Gateway
Top Stories

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ క్రూయిజ్ రెడీ

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ క్రూయిజ్ రెడీ
X

ప్ర‌స్తుతం అంతా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల యుగం న‌డుస్తోంది. ఎల‌క్ట్రిక్ బైక్స్..ఎల‌క్ట్రిక్ కార్లు. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు ప్ర‌పంచం వేగంగా మారుతోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఇంథ‌న వ్యయాలు అంత‌కంత‌కూ పెర‌గ‌టంతోపాటు..ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌తో కాలుష్యాన్నికూడా గ‌ణ‌నీయంగా త‌గ్గించే అవ‌కాశం ఉండ‌టంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పుడు ఇదే ట్రెండ్ న‌డుస్తోంది. వ‌చ్చే ప‌దేళ్ళ‌లో సింహ‌భాగం ఎల‌క్ట్రిక్ వాహనాలే ఉంటాయ‌న‌టంలో అతిశ‌యోక్తిలేదు. చాలా విష‌యాల్లో అంద‌రి కంటే ముందు ఉండే చైనా ఇప్పుడు మ‌రో విష‌యంలోనూ ముంద‌డుగు వేసింది. ఒక్క‌సారి ఛార్జింగ్ తో ఏకంగా 100 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించేందుకు అనువైన ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ క్రూయిజ్ ను రెడీ చేసింది. ఈ క్రూయిజ్ తొలి ప్ర‌యాణం కూడా పూర్తి అయింది.

వ‌చ్చే నెల నుంచి ఈ క్రూయిజ్ వాణిజ్య అవ‌స‌రాల‌కు అందుబాటులోకి రానుంది. 7500 కిలోవాట్ మెరైన్ బ్యాట‌రీని ఇందులో అమ‌ర్చారు. ఈ బ్యాట‌రీ ప్ర‌యాణం ద్వారా ఏకంగా 530 మెట్రిక్ ట‌న్నుల ఇంధ‌నాన్ని ఆదా చేయ‌వ‌చ్చ‌ని తేల్చారు. ఈ క్రూయిజ్ లో ఒకేసారి 1300 మంది ప్ర‌యాణికుల‌ను తీసుకెళ్ళ‌వ‌చ్చు. చైనాలోని యాంగ్జీ న‌దిలో ఈ క్రూయిజ్ ను ప‌ర్యాట‌కుల కోసం ఉప‌యోగించ‌నున్నారు. ఎల‌క్ట్రిక్ కార్ల‌కు సంబంధించి బ్యాట‌రీల త‌యారీలో ప్ర‌పంచంలోనే అగ్ర‌స్థానంలో ఉన్న కాంటెంప‌రెరీ అంపారెక్స్ టెక్నాల‌జీ కంపెనీ లిమిటెడే ఈ క్రూయిజ్ కోసం అతిపెద్ద బ్యాట‌రీని త‌యారు చేసింది. కంప్యూట‌ర్ నియంత్రిత విధానం ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు ఈ బ్యాట‌రీ ప‌నితీరును ప‌రిశీలిస్తారు.

Next Story
Share it