హాట్ టాపిక్ గా మారిన మోహన్ భగవత్ వ్యాఖ్యలు

ప్రధాని మోడీని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇరకాటంలో పడేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఒక అడుగు ముందుకు వేసి...మోహన్ భగవత్ వ్యాఖ్యలు మోడీ ని ఉద్దేశించి చేసినవే అని చెపుతోంది. ఎవరైనా సరే 75 సంవత్సరాలు వస్తే పక్కకు తప్పుకోవాలి...కొత్త వాళ్లకు అవకాశం కల్పించాలి అంటూ మోహన్ భగవత్ తాజాగా ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2025 సెప్టెంబర్ తో ప్రధాని మోడీ వయస్సు 75 సంవత్సరాలు పూర్తి అవుతాయి. దీంతో ఇప్పుడు మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది కీలకంగా మారింది అనే చెప్పాలి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన మాటలను బీజేపీ ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుందా లేక ఇది కేవలం ఒక డిస్కషన్ పాయింట్ గానే మిగిలిపోతుందా అన్నది వేచిచూడాలి.
బీజేపీ అగ్రనేతలు అయిన ఎల్ కె అద్వానీ , మురళి మనోహర్ జోషి, జస్వంత్ సింగ్ వంటి నేతలను ఇదే కారణంతో అంటే 75 సంవత్సరాలు నిండాయని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు మోడీ విషయంలో కూడా ఇది పాటిస్తారా లేదా అన్నది కీలకంగా మారింది. గత ఏడాది మార్చి లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోడీ మొదటి సారి నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. మోదీ రిటైర్మెంట్ అంశంపై చర్చించేందుకే వెళ్లారంటూ అప్పటిలో కూడా వార్తలు వచ్చాయి. అయితే మోడీ రిటైర్మెంట్ ఊహాగానాలను..ప్రచారాలను మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో ఇతర బీజేపీ కీలక నేతలు కూడా తోసిపుచ్చారు. గతంలో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ లు కూడా మోడీ రిటైర్ మెంట్ అంశంపై స్పందిస్తూ ఆయన్ను 75 సంవత్సరాల తర్వాత పదవి నుంచి దింపుతారు అంటూ ప్రచారం చేశారు. అయితే ప్రస్తుతం బీజేపీ లో ప్రధాని మోడీ అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్నందున ఇది అంత ఈజీ గా జరిగే పని కాదు అని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతున్నారు.



