Telugu Gateway
Top Stories

వచ్చే నెలలోనే రిటైర్మెంట్

వచ్చే నెలలోనే రిటైర్మెంట్
X

వచ్చే నెలలో పదవి విరమణ చేయాల్సి ఉన్న సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అఫ్ ఇండియా (సెకి) సీఎండీ రామేశ్వర్ ప్రసాద్ గుప్తా పై కేంద్రం సడన్ గా ఎందుకు వేటు వేసింది. రామేశ్వర్ ప్రసాద్ సేవలను సత్వరమే టెర్మినేట్ చేస్తూ అపాయింట్స్ మెంట్ కమిటీ నిర్ణయం తీసుకుంది అని డిపార్ట్ మెంట్ అఫ్ పర్సనల్ ట్రైనింగ్ (డీవోపీటీ) ఎందుకు ఘాటుగా నోటిఫికేషన్ జారీ చేయాల్సి వచ్చింది అన్నది ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి కారణం చెప్పకుండానే ఆయన్ను టెర్మినేట్ చేశారు. అది కూడా వచ్చే నెలలో పదవి విరమణ చేయాల్సి ఉన్న వ్యక్తి విషయంలో ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవటం వెనక చాలా బలమైన కారణాలు ఉండి ఉంటాయి అనే చర్చ సాగుతోంది. సెకి సిఫారసు ఆధారంగానే పలు రాష్ట్రాలు అదానీ గ్రూప్ కంపెనీల తో ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సోలార్ ప్రాజెక్ట్ లు దక్కించుకునేందుకు ఏకంగా 2000 కోట్ల రూపాయలకు పైగా ముడుపులు కీలక స్థానాల్లో ఉన్న రాజకీయ నేతలు, అధికారులకు అప్పగించినట్లు కూడా అమెరికా లో కేసు నమోదు అయింది.

ఇప్పుడు అమెరికా లో నమోదు అయిన కేసు అటకెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా పరిణామాలు వేగంగా ముందుకు సాగుతున్నట్లు ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రానున్న కాలంలో పెద్ద ఎత్తున అంటే ఏకంగా 20 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రోజెక్టుల టెండర్లు ఖరారు చేయాల్సి ఉన్న సమయంలో ఈ సడన్ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. సెకి ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో అదానీ కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందాలు...రెన్యువబుల్ ఎనర్జీ టెండర్ కోసం సెకి కి రిలయన్స్ పవర్ ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించటం వంటి విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అవినీతి ఆరోపణలకు సంబంధించి అమెరికా ప్రాసిక్యూటర్స్ గౌతమ్ అదానీ తో పాటు ఇతర అధికారులపై నేరారోపణలు చేసినా కూడా ఆయన గతంలో మీడియా తో మాట్లడుతూ తాము ఎలాంటి తప్పు చేయలేదు అని...ఒప్పందాలపై సెకి ఎలాంటి సమీక్ష చేయదు..దీనిపై విచారణకు ఆదేశించదు అంటూ ప్రకటించారు.

అయినా సరే ఇప్పుడు మోడీ సర్కారు ఆయన్ను ఇంత వేగంగా ఎందుకు పక్కకు తప్పించింది...దీని వెనక ఉన్న కారణాలు ఏమై ఉంటాయి అన్న చర్చ కార్పొరేట్, రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన ట్వీట్ చేశారు. 2024 డిసెంబర్ లో సెకి పవర్ టెండర్ల జారీ విషయంలో మార్పులు చేయటం ద్వారా గతంలో జరిగిన అవినీతిని పరోక్షంగా అంగీకరించినట్లు అయింది అని పేర్కొన్నారు. అదానీ తో పాటు ఇతరులకు సమన్లు జారీ చేయాలని యూఎస్ సెక్యూరిటీస్ కమిషన్ వినతులను కేంద్రం పట్టించుకోలేదు అన్నారు. అత్యున్నత స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ, మోదానీ మెగాస్కామ్‌ను కప్పిపుచ్చలేరు అంటూ జైరాం రమేష్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it