Telugu Gateway
Top Stories

వాట్సప్ లో వణుకు మొదలైంది

వాట్సప్ లో వణుకు మొదలైంది
X

నిన్న మొన్నటి వరకూ తిరుగులేని యాప్. ఒక్క నిర్ణయం ఆ సంస్థకే వణుకు పుట్టేలా చేసింది. అంతే కాదు..ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. కానీ మరింత నష్టం జరగకుండా చూసుకునేందుకు నానా తిప్పలు పడుతోంది. యూజర్లు వరస పెట్టి 'సిగ్నల్' యాప్ కు వెళుతున్నారు. అది ఎంతలా అంటే. కొత్తగా వచ్చే యూజర్లను తట్టుకునే సామర్ధ్యం లేక సిగ్నల్ యాప్ క్రాష్ అయ్యేంతగా. దీంతో వరస పెట్టి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది వాట్సప్ యాజమాన్యం. అందులో భాగంగా తాజాగా నూతన ప్రైవసీ విధానంపై వాట్సాప్‌ వెనక్కి తగ్గింది. మరో మూడు నెలల పాటు అప్‌డేట్‌ని వాయిదా వేయనున్నట్లు ప్రకటించింది. ఇటీవలే వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే యూజర్లలో కలకలం ప్రారంభం అయింది. తాము తెచ్చిన నిబంధనలను అంగీకరించకపోతే 2021, ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్‌ పని చేయదని ప్రకటించింది.

కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ ప్రకారం వాట్సాప్..‌ యూజర్‌ వ్యక్తిగత‌ సమాచారం, డివైజ్‌ ఇన్ఫర్మేషన్‌, ఐపీ అడ్రస్‌ తదితర వివరాలను ఫేస్‌బుక్‌తో పంచుకోనుంది. ఇక వ్యక్తిగత గోపత్యకు భంగం కలగనుందనే ఉద్దేశంతో చాలా మంది యూజర్లు వాట్సాప్‌ను డిలీట్‌ చేసి.. టెలిగ్రాం, సిగ్నల్‌ యాప్స్‌ కి షిప్ట్ అయ్యారు. దీంతో జరుగుతున్న నష్టం గ్రహించి పదే పదే వివరణలు ఇవ్వటం ప్రారంభించింది. ''మీరు.. మీ కుటంబ సభ్యులు, స్నేహితులతో పంచుకునే సమాచారం ఏదైనా మీ మధ్యే ఉండేలా వాట్సాప్‌ని అభివృద్ధి చేశాం. మీ వ్యక్తిగత సంభాషణని ఎండ్‌-టూ-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ పద్దతిలో మేం రక్షిస్తాం.

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మీ సందేశాలను చదవదు.. మీరు పంపే లోకేషన్‌లని చూడదు.. మీరు ఎవరికి కాల్‌ చేశారు.. ఎవరితో మెసేజ్‌ చేస్తున్నారనే విషయాలను కూడా మేం గమనించం. మీ కాంటాక్ట్స్‌ ని ఫేస్ బుక్ తో పంచుకోం'' అని తెలిపింది. ''ఈ నూతన అప్‌డేట్‌ వల్ల ఏదీ మారడం లేదు. బిజినెస్‌ ఫీచర్స్‌ ని మరింత మెరుగ్గా అందించడం కోసం మాత్రమే ఈ అప్‌డేట్‌ని తీసుకొచ్చాం. మేము డేటాను ఎలా సేకరిస్తాము, ఉపయోగిస్తాము అనే దానిపై ఇది మరింత పారదర్శకతను అందిస్తుంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ వాట్సాప్‌ బిజినెస్‌తో షాపింగ్ చేయకపోయినా, భవిష్యత్తులో ఎక్కువ మంది వ్యక్తులు దీన్ని ఎంచుకుంటారని మేము భావిస్తున్నాము. ఈ సేవల గురించి ముఖ్యమైన వ్యక్తులకు తెలుసు. ఈ అప్‌డేట్‌ ఫేస్‌బుక్‌తో డాటాను పంచుకునే మా సామర్థ్యాన్ని పెంచదు'' అని స్పష్టం చేసింది.

Next Story
Share it