Telugu Gateway
Top Stories

ఏటీఎంల లూటీ కోసం క్రాష్ కోర్స్

ఏటీఎంల లూటీ కోసం క్రాష్ కోర్స్
X

స్టార్టప్ అంటే వినూత్న ఐడియా తో వ్యాపారం ప్రారంభించేందుకు వేసే తొలి అడుగు. అయితే ఈ స్టార్టప్ లో ఎంత మంది ఉండాలనేది వారి వారి ఇష్టం ఆధారంగా ఉంటుంది. కాసేపు ఈ సంగతి పక్కనపెడితే బీహార్ లో ఒక స్టార్టప్ చేసిన పని ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది అనే చెప్పాలి. అదేంటి అంటే ఏటీఎంల నుంచి డబ్బు ఎలా దోచుకోవాలనే అంశంపై మూడు నెలల క్రాష్ కోర్స్ స్టార్ట్ చేసింది ఆ స్టార్టప్. నిరుద్యోగ యువతకు పదిహేను నిమిషాల వ్యవధిలో ఎటిఎం ను ఎలా పగలగొట్టాలి అనే అంశంపై శిక్షణ ఇచ్చారు. దీని వెనక సుధీర్ మిశ్రా అనే వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు అయన కోసం గాలింపు సాగుతోంది. అయితే ఇక్కడ శిక్షణ పొందిన వారు ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ లకు చిక్కారు.

ఈ విషయాలను యూపీ పోలీసులే వెల్లడించారు. ఏటీఎంల్లో ఉండే కెమెరా లపై లిక్విడ్ ఎలా కొట్టాలి...తర్వాత పదిహేను నిమిషాల్లో ఏటీఎం బాక్స్ ను కట్ చేసి ఎలా తప్పించుకోవాలి అనే అంశంపై ఈ క్రాష్ కోర్స్ సాగింది. లక్నోలోని సుశాంత్ సిటీ ఏరియా లో ఉన్న ఒక ఏటీఎం నుంచి ఇందులో శిక్షణ పొందిన వారు 39 లక్షలకు పైగా దోచుకుపోయారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు దేశ వ్యాప్తంగా 30 చోట్ల ఇలాంటి ఎటిఎం ల దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. అయితే ఈ టీం ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అన్నది సీసీటీవీ లను చూసి పోలీసులు గుర్తించారు. ఎంత శిక్షణ పొందినా వీళ్ళు ఏటీఎంల బయట ఉండే సీసీటీవీ లను తప్పించుకోలేరుగా.

Next Story
Share it