Telugu Gateway
Top Stories

లాక్ డౌన్ నుంచి దేశాన్ని రక్షించుకోవాలి

లాక్ డౌన్ నుంచి దేశాన్ని రక్షించుకోవాలి
X

రాష్ట్రాలకూ ఇది చివరి అస్త్రమే కావాలి

అందరం కలసి సమస్యను ఎదుర్కొందాం

దేశంలో ప్రస్తుతం కరోనా రెండవ దశ తుపాన్ లా దూసుకొచ్చిందని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రంతోపాటు రాష్ట్రాలు..ప్రైవేట్ రంగం కూడా తన వంతు పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అందరం కలసి సమస్యను ఎదుర్కొందామని ప్రకటించారు. ఎవరూ కూడా ధైర్యం కోల్పోకుండా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని ప్రముఖ వ్యాక్సిన్ తయారీదారులు, ఫార్మా రంగ ప్రముఖులతో భేటీ అనంతరం ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం రాత్రి జాతినుద్దేశించి మాట్లాడారు. దేశాన్ని ప్రస్తుతం ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోందని..ఈ సమస్యను అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహమ్మారిపై ప్రస్తుతం భీకర యుద్ధం చేస్తున్నామని తెలిపారు. దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు.

వైద్యులతోపాటు పారా మెడికల్ సిబ్బంది, సఫాయి కార్మికుల కృషి కూడా ఇందులో ఎంతో ఉందన్నారు. ఆక్సిజన్ రైలు దేశంలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం కాస్త పరిస్థితులు మెరుగయ్యాయని అన్నారు. ప్రతి చోటా యువకులు కాలనీలు, అపార్ట్ మెంట్లలో కమిటీలు ఏర్పాటు చేసుకుని చర్యలు తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. దీని వల్ల కంటైన్మెంట్ జోన్లు, లాక్ డౌన్ లు పెట్టాల్సిన అవసరం ఉండదని తెలిపారు. రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ ను చివరి అస్త్రంగానే ఉపయోగించాలన్నారు. ఆర్ధిక వ్యవస్థను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story
Share it