అమెరికా బాటలోనే కెనడా!

భారతీయ విద్యార్థులను అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు. ఆయన రెండవారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అటు భారతీయ ఐటి ఉద్యోగులతో పాటు విద్యార్థులే టార్గెట్ గా పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ దెబ్బకు విద్యార్థులు కూడా ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలనే ప్రణాళికలు మానుకుని ఇతర మార్గాల వైపు దృష్టి సారించారు. అమెరికా తర్వాత భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఎక్కువ వెళ్లే దేశాల్లో కెనడా రెండవ స్థానంలో ఉంటుంది. అమెరికా తరహాలోనే ఈ సారి కెనడా కూడా భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారతీయ విద్యార్థుల వీసా లు పెద్ద ఎత్తున రిజెక్ట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు విద్యార్థులకు డబుల్ ట్రబుల్ అన్నట్లు అయింది పరిస్థితి.
అటు అమెరికా ఛాన్స్ లేక...ఇటు కెనడా కూడా అదే బాట పట్టడంతో ఈ ప్రభావం దేశీయ విద్యార్ధులపై భారీగానే పడే అవకాశం ఉంది అని నిపుణులు చెపుతున్నారు. కెనడాలో చదువుకునేందుకు విద్యార్థులు చేసుకున్న వీసా దరఖాస్తుల్లో ప్రతి నలుగురిలో ముగ్గురి వీసాలు రిజెక్ట్ అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 2023 సంవత్సరంలో కెనడా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ చేసిన దరఖాస్తుల తిరస్కరణ 32 శాతం ఉంటే..2025 సంవత్సరంలో అది ఏకంగా 74 శాతానికి పెరిగింది. ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే చైనా విద్యార్థుల వీసాల తిరస్కరణ రేట్ 24 శాతంగానే ఉంది. అమెరికా కూడా భారతీయ విద్యార్ధులపై ఎక్కువ ఆంక్షలు విధించి చైనా విద్యార్థుల విషయంలో కొంత సానుకూలంగా వెళుతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు కెనడా కూడా అదే లైన్ లో వెళుతున్నట్లు కనిపిస్తోంది.
కెనడా గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మంది విదేశీ విద్యార్థులకు అవకాశం కలిపించింది. ఇందులో మన భారతీయుల వాటానే 41 శాతం ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే కెనడా ఇమ్మిగ్రేషన్ అధికారులు చెపుతున్న దాని ప్రకారం ఇండియా నుంచి పెద్ద ఎత్తున ఫ్రాడ్ అడ్మిషన్ డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. దీంతో వెరిఫికేషన్ సిస్టం ను కూడా కెనడా మరింత కట్టుదిట్టం చేసింది. కొంత మంది చేసే మోసాల కారణంగా నిజంగా కెనడాలో చదువుకుందామనుకునే విద్యార్థుల ఆశలకు కూడా గండికొడుతుంది అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. తాజా పరిణామాలతో కెనడా యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థుల అడ్మిషన్స్ కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.



