Telugu Gateway
Top Stories

రెండవ దశ చర్చలకు రంగం సిద్ధం?!

రెండవ దశ చర్చలకు రంగం సిద్ధం?!
X

కాల్పుల విరమణ జరిగినా కూడా ఇప్పుడు అమెరికా, ఇరాన్ ల మధ్య యుద్ధం హర్ముజ్ జలసంధి దగ్గర జరుగుతోంది. ఇస్లామాబాద్ లో జరిగిన చర్చలు విఫలం కావటంతో అమెరికా ఏకంగా హర్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేసింది. దీంతో ఇరాన్ నుంచి ఈ జలసంధి మార్గంలో నౌకలు బయటకు రావటానికి వీలు లేదు...లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే అంశం. అమెరికా మిత్ర దేశాలు సైతం హర్ముజ్ ను అమెరికా మూసివేయటాన్ని తప్పుపడుతున్నాయి. ఇలా హర్ముజ్ జలసంధిని అమెరికా పూర్తిగా మూసివేయటం వల్ల రోజుకు ఇరాన్ కు 4000 కోట్ల రూపాయల పైనే నష్టం వాటిల్లే అవకాశం ఉంది అని అమెరికా కు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇరాన్ నుంచి ఎగుమతులు నిలిచిపోవటంతో పలు ఇతర కారణాలతో ఇరాన్ కు ఈ మేరకు నష్టం వాటిల్లుతుంది అని లెక్కలేశారు.

ఇప్పటికే అమెరికా-ఇజ్రాయెల్ లు చేసిన దాడులతో భారీగా నష్టపోయిన ఇరాన్ ఎన్ని రోజులు హర్ముజ్ జలసంధి మూసివేతను భరించగలడు అన్నది ఇప్పుడు కీలకంగా మారబోతోంది. మరో వైపు చైనా తో పాటు పలు ఇతర దేశాలు కూడా అమెరికా హర్ముజ్ జలసంధిని మూసివేయటాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఇరాన్ తో తమ సంబంధాల విషయంలో ఇతరుల జోక్యాన్ని సహించేది లేదు అని చైనా హెచ్చరించింది. ఈ జలసంధి మీదగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకల రవాణా జరగాలని చైనా స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే త్వరలోనే అమెరికా- ఇరాన్ ల మధ్య రెండవ దఫా చర్చలు జరిగే అవకాశం ఉంది అనే వార్తలు బయటకు వస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సారి తమతో ఒప్పందానికి ఇరాన్ సిద్ధం అవుతోంది అని చెప్పారు. అమెరికా తరపున చర్చల్లో పాల్గొన్న ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జె డీ వాన్స్ కూడా ఇప్పుడు బంతి ఇరాన్ కోర్ట్ లోనే ఉంది అని స్పష్టం చేశారు. అణ్వాయుధాల తయారీ విషయంలోనే ముఖ్యంగా రెండు దేశాల మధ్య పీటముడి పడింది. యురేనియం శుద్ధిని ఇరవై సంవత్సరాల పాటు నిలిపివేయాలని అమెరికా కోరగా..ఇరాన్ మాత్రం ఐదు సంవత్సరాల పాటు యురేనియం శుద్ధిని నిలిపివేయడానికి అంగీకరించినట్లు తాజాగా బయటకు వచ్చింది. మరి ఈ విషయంలో రెండు దేశాలు ఎలాంటి పట్టు విడుపులు ప్రదర్శిస్తాయి...ఈ యుద్దానికి శాశ్వత ముగింపు పడేలా ఒప్పందం జరుగుతుందా లేదా అన్న అంశంపై అందరిలో ఉత్కంఠ నెలకొని ఉంది. ఇప్పటికే త్వరలో జరగనున్న ముఖాముఖీ చర్చలకు సంబంధించి అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు చెపుతున్నారు. అయితే రెండవ దశ చర్చలు కూడా ఇస్లామాబాద్ లోనే జరుగుతాయా..లేక మరో చోటా అన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Next Story
Share it