విదేశాంగ మంత్రి కి పెద్ద ఎత్తున మెయిల్స్!

ఒక దేశం వీసా ల జారీ విషయంలో మరో దేశం జోక్యానికి ఛాన్స్ ఉండదు. ఆయా దేశాలు తమ తమ విధానాల ప్రకారం ఎవరికీ వీసా ఇవ్వాలి...ఎవరికీ వద్దు అనే డిసైడ్ చేసుకుంటాయనే విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున గందరగోళానికి కారణం అవుతున్నాయి. ఇండియా విషయానికి వస్తే ముఖ్యంగా విద్యార్థులతో పాటు ఐటి ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అమెరికా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లకు వీసా లు ఇవ్వమని ఎవరూ అడగరు...ఎవరైనా అడిగినా అమెరికా లాంటి దేశం అసలు పట్టించుకోదు. కాకపోతే అమెరికా ప్రభుత్వం తీసుకునే ఆకస్మిక నిర్ణయాల కారణంగా భారతీయలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశంపై ఎంతో మంది ఐటి నిపుణులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిదిగా కోరుతూ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ కు పెద్ద ఎత్తున మెయిల్స్ పెడుతున్నట్లు ఎన్ఆర్ఐ లు చెపుతున్నారు. వాళ్ళు ప్రధానంగా ఇటీవల చోటు చేసుకున్న అంశాలనే ప్రస్తావిస్తున్నారు.
ఇందులోని కీలక అంశాలు ఇలా ఉన్నాయి. గత కొన్ని వారాలుగా, భారత్‌లోని అమెరికా కాన్సులేట్లలో పెద్ద సంఖ్యలో వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లు అకస్మాత్తుగా రద్దు చేయబడుతున్నాయి లేదా మళ్లీ షెడ్యూల్ చేయబడుతున్నాయి. చాలా సందర్భాల్లో, కేవలం నాలుగు నుంచి ఐదు రోజుల ముందస్తు నోటీసుతోనే ఇవి జరుగుతున్నాయి. అనేక మంది దరఖాస్తుదారులు ఇప్పటికే ఫింగర్‌ప్రింటింగ్ అపాయింట్‌మెంట్లు పూర్తిచేసి, ప్రత్యేకంగా వీసా స్టాంపింగ్ కోసం భారత్‌కు ప్రయాణించారు. ఈ రద్దుల తరువాత, ఇంటర్వ్యూలు నాలుగు నుంచి ఆరు నెలలకు వాయిదా వేస్తున్నారు. ఫలితంగా, యునైటెడ్ స్టేట్స్‌లోని తమ ఉద్యోగాలకు ఎప్పుడు తిరిగి వెళ్లే ఛాన్స్ ఉందో తెలియక చాలా మంది భారత్‌లోనే చిక్కుకుపోతున్నారు. ఈ అకస్మాత్తు అనిశ్చితి భారతీయ నిపుణులకు, వారి కుటుంబాలకు తీవ్ర వేదన కలిగిస్తోంది. అనేక మంది దరఖాస్తుదారులకు చెల్లుబాటు అయ్యే, ఆమోదించబడిన పిటిషన్లు ఉన్నాయి.వారు సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, పరిశోధన వంటి కీలక రంగాల్లో పనిచేస్తున్నారు.
దరఖాస్తుదారులు అన్ని విధానపరమైన అవసరాలను పూర్తిగా పాటించినప్పటికీ, పొడిగించిన, ఊహించని ఆలస్యాలు జీవనోపాధులను, వృత్తిపరమైన బాధ్యతలను, దీర్ఘకాలిక ప్రణాళికలను తీవ్రంగా అంతరాయం కలిగిస్తున్నాయి అని జై శంకర్ కు పెట్టిన మెయిల్స్ లో ప్రస్తావించారు. 2022లో యునైటెడ్ స్టేట్స్ వీసా వేచిచూసే కాలాలు దీర్ఘకాలంగా ఉండటంపై మీరు యుఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ గారితో ఈ అంశాన్ని ప్రస్తావించడంలో చేసిన సకాల జోక్యం ఫలితంగా, లక్షకు పైగా ఉద్యోగ ఆధారిత వీసా అపాయింట్‌మెంట్లు విడుదల చేయబడిన విషయం మాకు గుర్తుంది. ఆ చర్య అప్పటిలో వేలాది భారతీయ దరఖాస్తుదారులకు గణనీయమైన ఉపశమనం కలిగించింది. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అకస్మాత్తు ఇంటర్వ్యూ రద్దులు, చట్టబద్ధంగా విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ పౌరులు దీర్ఘకాలం చిక్కుకుపోకుండా ఉండేందుకు స్పష్టత, అంచనా వేయదగిన విధానం, మరియు మార్గాంతర చర్యలను కోరుతూ, మరోసారి యుఎస్ అధికారులతో చర్చించాలనే అంశాన్ని మీ కార్యాలయం పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాము అంటూ పలు మెయిల్స్ ఆయన కార్యాలయానికి చేరుతున్నాయి. గతంలో జరిగినట్లే, తాత్కాలిక లేదా దశలవారీ పరిష్కారాలు, ఉదాహరణకు పెద్ద ఎత్తున అపాయింట్‌మెంట్ల విడుదల వంటి చర్యలు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలను గణనీయంగా తగ్గించగలవు అని పేర్కొన్నారు.



