అలా అయితేనే వీసా జారీ

అమెరికా ప్రెసిడెంట్ గా డోనాల్డ్ ట్రంప్ రెండవ సారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విద్యార్థులతో పాటు ఇతర వీసాల విషయంలో కూడా ఆయన కొరడా జుళిపిస్తూ వస్తున్నారు. అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసే వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలను జల్లెడపట్టిన తర్వాతే వీసాలు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల్లో ఎలాంటి అమెరికా వ్యతిరేక వ్యాఖ్యలు..ఇతర అభ్యంతరకర కామెంట్స్ అందులో కంటపడితే అలాంటి వాళ్లకు వీసా వచ్చే ఛాన్స్ ఉండదు అనే చెప్పొచ్చు. తాజాగా దీనికి సంబంధించి భారత్ లోని అమెరికా ఎంబసి కీలక ఆదేశాలు జారీ చేసింది. అవేంటి అంటే ఎఫ్, ఎం, జె వీసాలకు దరఖాస్తు చేసే వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవసీ సెట్టింగ్స్ లో ప్రైవేట్ నుంచి ఖచ్చితంగా పబ్లిక్ కు మార్చాలని స్పష్టం చేశారు. అప్పుడు మాత్రమే అమెరికా చట్టాల ప్రకారం ఆయా వ్యక్తులను తమ దేశంలోకి అనుమతించాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకునే వీలు ఉంటుంది అని తెలిపారు.
వీసా ఎఫ్ అంటే అమెరికా లో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు జారీ చేసేది. నాన్ అకడమిక్ ఒకేషనల్ కోర్స్ ల్లో చేరే వాళ్లకు జారీ చేసేది ఎం వీసా. జె వీసా అంటే అమెరికా లో నిర్వహించే సాంస్కృతిక, విద్యా కార్యక్రమాల్లో పాల్గొనటానికి అనుమతించేది. ఇవి అన్నీ కూడా నాన్ ఇమ్మిగ్రంట్ వీసా లే . అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసిన వారు ఎవరైనా తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ గా ఉంచితే వాళ్లకు వీసా మంజూరు చేయరు. ప్రతి వీసాపై తీర్పు జాతీయ భద్రతా నిర్ణయం అని స్పష్టం చేశారు. 2019 నుంచి కూడా అమెరికా వీసా జారీ సమయంలో సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేస్తోంది. ఈ తనిఖీ సమయంలో ఎవరైనా తమ జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నారా అనే అంశాలను పరిశీలిస్తున్నారు.



