అమెరికాలో మాంద్యానికే 70 శాతం ఛాన్స్

కొత్త ఏడాదిలోకి కొత్త ఆశలతో వెళ్లేందుకు సిద్ధం అవుతున్న వేళ అన్ని అపశకునములే. పలు దేశాల్లో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన రేపుతుండగా..ఇప్పుడు మాంద్యం భయాలు నిజం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అగ్ర రాజ్యం అమెరికా 2023 లో మాంద్యంలోకి జారుకోవటానికి 70 శాతం ఛాన్స్ ఉందని ఆ దేశంలోని ఆర్థిక వేత్తలు గట్టిగా చెపుతున్నారు. ఆరు నెలల క్రితం తో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి రెట్టింపు అయిందని తెలిపారు. అమెరికాలో వరసగా పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి అంశాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సమస్యలు ఎదుర్కుంటోంది.
అమెరికా ఫెడ్ రిజర్వు ఇటీవలే 0 .5 శాతం వడ్డీ రేట్లను పెంచింది. దీంతో అక్కడ వడ్డీ రేట్లు 4 .5 శాతానికి చేరాయి. 2023 లో అమెరికా ఫెడ్ ఏకంగా ఏడు సార్లు వడ్డీ రేట్లు పెంచింది అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. గత 15 ఏళ్లలో ఇంత గరిష్ట స్థాయిలో వడ్డీ రేట్లు ఉండటం ఇదే మొదటిసారి కావటం గమనార్హం. దిగ్గజ ఐటి కంపెనీలు గత కొంత కాలంగా ఖర్చులు తగ్గించుకుందుకు పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోతలు పెట్టిన విషయం తెలిసిందే.



