కాబూల్ దాడికి ప్రతీకారం తీర్చుకున్న అమెరికా
ఆమెరికా ఆగమేఘాల మీద కదిలింది. కాబూల్ విమానాశ్రయంలో అమెరికా సైనికులు..పౌరులు భారీ ఎత్తున మరణించటంతో దీనికి భాద్యులైన వారిని వదిలిపెట్టమని హెచ్చరించిన విషయం తెలిసిందే. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఇందుకు తగిన మూల్యం చెల్లించకతప్పదన్నారు. అందుకు తగినట్లుగానే వెంటనే చర్యలు ప్రారంభించింది. డ్రోన్ దాడి ద్వారా కాబూల్ విమానాశ్రయం పేలుళ్ళకు కారణంగా ప్రకటించుకున్న ఇస్తామిక్ స్టేట్ కరోస్ (ఐఎస్ఐఎస్-కె) గ్రూప్ వ్యూహకర్తను హతమార్చినట్లు ప్రకటించింది. సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం లేకుండా టార్గెట్ ను పూర్తి చేసినట్లు చెబుతున్నారు.అఫ్గన్ భూభాగం అవతలి నుంచే రీపర్ డ్రోన్ సహాయంతో ఈ దాడికి పాల్పడింది. కాబూల్ పేలుళ్ల సూత్రధారి ఓ వాహనంలో వెళ్తుండగా గుర్తించి.. ఆ పక్కా సమాచారంతో దాడి నిర్వహించింది.
ఈ దాడిలో ఆత్మాహుతి దాడుల వ్యూహకర్తతో పాటు అతని సహాయకుడు మృతిచెందాడని, సాధారణ పౌరులెవరికీ ఏం కాలేదని సెంట్రల్ కమాండ్ కెప్టెన్ బిల్ అర్బన్ ఓ ప్రకటనలో స్పష్టం చేశాడు. మధ్య ఆసియా దేశాల్లోని అమెరికన్ ఆర్మీ బేస్ నుంచి నిర్వహించిన ఈ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు వైట్ హౌస్ దళాలు వెల్లడించాయి. మరోవైపు కాబూల్ దాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. బలగాల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు ప్రకటించింది. ఇంకోవైపు ఎయిర్‌పోర్ట్ బయట సాధారణ పౌరులు ఉండకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. గురువారం రాత్రి కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర జరిగిన జంట బాంబు పేలుళ్లలో 13 మంది యూఎస్ సైనికులు, 78 మంది పౌరులు చనిపోయారు.