Telugu Gateway
Top Stories

ఖర్గ్ ఐలాండ్..ఇరాన్ రైల్వే నెట్ వర్క్ లపై దాడులు

ఖర్గ్ ఐలాండ్..ఇరాన్ రైల్వే నెట్ వర్క్ లపై  దాడులు
X

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే చేశారు. ఇరాన్ కు ఇచ్చిన గడువు కంటే కొన్ని గంటల ముందే ఆ దేశంపై వరస దాడులకు దిగారు. అమెరికా, ఇజ్రాయెల్ లు సంయుక్తంగా ఇరాన్ పై భారీ ఎత్తున దాడులకు తెగబడ్డాయి. ఇరాన్ కు అత్యంత కీలకం అయిన ఖర్గ్ ఐలాండ్ పై బాంబుల వర్షం కురిసింది. దీంతో ఇరాన్ కు ఆర్థికంగా ఎంతో కీలకం అయిన ఈ ఐలాండ్ పూర్తిగా దెబ్బతిన్నది. ఇరాన్ నుంచి 90 శాతం వరకు ఇంధన ఎగుమతులు ఇక్కడ నుంచే జరుగుతాయి. తాజా దాడుల్లో దీన్ని పూర్తిగా ధ్వంసం చేయటంతో రాబోయే రోజుల్లో ఇరాన్ కు భారీ నష్టం తప్పదు అనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ దాడులకు ముందే ఇజ్రాయిల్ ఇరాన్ లోని అన్ని ఎయిర్ బేస్ లను వైమానిక దాడులతో నాశనం చేసింది. ఖర్గ్ ఐలాండ్ ను ధ్వంసం చేయటంతో పాటు ఇరాన్ లోని పలు రైల్వే నెట్ వర్క్ లపై కూడా అమెరికా, ఇజ్రాయెల్ లు దాడులకు దిగాయి. దీంతో చాలా చోట్లా రైల్వే సర్వీసులు నిలిపివేశారు. తమతో ఒప్పందం చేసుకోకపోతే మౌలిక సదుపాయాలపై దాడులకు దిగుతున్నారు.

ఈ దాడులకు ముందు ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ సంచనల వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని కాపాడుకునేందుకు ఇరాన్ ప్రజలు ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్టు పెట్టారు. దేశం కోసం తాను సైతం ప్రాణత్యాగానికి సిద్ధమేనని అన్నారు. ఇరాన్‌ను కాపాడుకునేందుకు ప్రాణత్యాగానికి సిద్ధమని ఇప్పటి వరకూ 140 లక్షల మందికి పైగా ఇరాన్ ప్రజలు ప్రకటించారు అని తెలిపారు. హర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తామని ట్రంప్ గత కొంత కాలంగా హెచ్చరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా దాడుల నుంచి విద్యుత్ కేంద్రాలు, బ్రిడ్జిలను రక్షించుకునేందుకు క్రీడాకారులు, విద్యార్థులు సహా యువత స్వచ్ఛందంగా విద్యుత్ కేంద్రాల వద్దకు ర్యాలీగా రావాలని, మానవహారంగా ఏర్పడాలని ఆ దేశ క్రీడలు, యువజన శాఖ మంత్రి అలీ రెజా రహీమీ పిలుపునిచ్చారు. ఉజ్వల భవిష్యత్తు కోసం ఇరాన్ యువత మానవహారం పేరుతో ఈ కార్యక్రమం చేపట్టాలని ఒక వీడియో సందేశంలో కోరారు. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ లు చేసిన దాడులపై ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. అమెరికా రెడ్ లైన్ క్రాస్ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరించింది.

Next Story
Share it