త్వరలో ప్రకటన ..రంగం సిద్ధం!

ఇరాన్ పై చేసిన యుద్ధం కారణంగా అమెరికా ఇప్పటికే భారీగా నష్టపోయింది. ధరల పెరుగుదలతో మరో వైపు అమెరికా ప్రజల్లో కూడా ట్రంప్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు అనే లక్ష్యంతో అమెరికా, ఇజ్రాయిల్ లు ఇరాన్ పై పెద్ద ఎత్తున దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ యుద్ధం కారణంతో ఇరాన్ కూడా భారీ మూల్యం చెల్లించుకుంది. ఏకంగా ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీ కూడా ఈ దాడుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. భారీ నష్టాలు చవిచూసిన తర్వాత కూడా అమెరికా కోరుకున్నట్లు ఇరాన్ ఎక్కడా సరెండర్ కాలేదు. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కూడా యుద్దానికి సై అంటే సై అంటూ కాలుదువ్వుతోంది. ఈ దశలో యుద్దానికి ముగింపు పలకటం రెండు దేశాలకు ఎంతో కీలకంగా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరో వైపు ఇరాన్ పై దాడులకు అమెరికా కాలుదువ్వుతున్నా కూడా గల్ఫ్ దేశాలు మాత్రం ఇందుకు అంగీకరించటం లేదు..మరో సారి యుద్ధం అంటూ మొదలైతే అది తీవ్రరూపం దాల్చే అవకాశం ఉండంతో అమెరికా పై యూఏఈ దేశాలు పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చాయి.
ఎలాగైనా సరే ఒక ఒప్పందం కుదిర్చేందుకు ఈ దేశాలు అన్నీ కూడా ఇరాన్ తో చర్చలు జరుపుతున్నాయి...ఇందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. రెండు దేశాల చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ కూడా ఈ యుద్దాన్ని ఆపి ప్రపంచ వ్యాప్తంగా క్రెడిట్ కొట్టేయాలని ప్లాన్ లో వేగంగా పావులు కదుపుతోంది. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఈ యుద్దానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కీలక ఒప్పందం చాలా దగ్గరలో ఉందని, చర్చలు తుది దశకు చేరుకున్నాయని తన సోషల్ మీడియా ఖాతా 'ట్రూత్' ద్వారా వెల్లడించారు. ఇజ్రాయెల్, ఆ ప్రాంతంలోని ఇతర మిత్రదేశాలతో సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు. గత కొద్ది రోజులుగా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా విషయం తెలిసిందే. 'అమెరికా, ఇరాన్ మధ్య ఒక భారీ ఒప్పందం చాలా వరకు చర్చల ద్వారా కుదిరింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడాను. అది కూడా చాలా బాగా జరిగింది. ఒప్పందానికి సంబంధించిన తుది అంశాలు, వివరాలు ప్రస్తుతం చర్చిస్తున్నారు. త్వరలోనే వాటిని ప్రకటిస్తారు' అని ట్రంప్ పేర్కొన్నారు.



