Telugu Gateway
Top Stories

ట్రంప్ ఆశలన్నీ గల్లంతు..బైడెన్ కు 306 ఓట్లు

ట్రంప్ ఆశలన్నీ గల్లంతు..బైడెన్ కు 306 ఓట్లు
X

డొనాల్డ్ ట్రంప్ ఆ చివరి ఆశ కూడా నెరవేరలేదు. దీంతో ఆయన ఇంటికెళ్ళటం మరింత అధికారికం అయింది. తాజాగా జరిగిన ఓటింగ్ లో జో బైడెన్ కు ఎలక్ట్రోరల్ కాలేజీలో 306 ఓట్లు దక్కాయి. ట్రంప్ కు 232 ఓట్లు వచ్చాయి. దీంతో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక మరింత అధికారికం అయింది. ఎలక్ట్రోరల్ కాలేజీ ఎన్నిక లాంఛనమే అయినా..అమెరికా రాజ్యాంగం ప్రకారం ఇది ఎంతో కీలకం. ఈ ఘట్టం కూడా ముగియటంతో డొనాల్డ్ ట్రంప్ ఆశలు అన్నీ గల్లంతు అయ్యాయి. వైట్ హౌస్ వీడటం తప్ప ఆయనకు మరో మార్గం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి నానా హంగామా చేస్తూ తానే గెలిచానని..తానే అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతానంటూ ప్రకటనలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

ఎలక్ట్రోరల్ కాలేజీలో ఎన్నిక అనంతరం జో బైడెన్ మాట్లాడుతూ అమెరికాలో ప్రజాస్వామ్యం నిలబడిందని అన్నారు. అందరూ ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, తనకు ఓటు వేయని వారి కోసం కూడా మరింత కష్టపడి పనిచేస్తానని బైడెన్ ప్రకటించారు. అమెరికాలో రాజకీయ నాయకులు అధికారం తీసుకోరని, ప్రజలే వారికి అప్పగిస్తారని వ్యాఖ్యానించారు..ప్రజాస్వామ్యం అనే దీపాన్ని అమెరికాలో చాలా సంవత్సరాల క్రితమే వెలిగించారు. ఏ మహమ్మారి అయినా..ఎంతటి అధికార దుర్వినియోగం అయినా ఈ దీపాన్ని ఆర్పలేవని జో బైడెన్ వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితం ట్రంప్ ఎలక్ట్రోరల్కో కాలేజీలో బైడెన్ విజయం సాధిస్తే వైట్ హౌస్ ఖాళీ చేయటం గురించి అప్పుడు ఆలోచిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అది కూడా అయిపోయింది.

Next Story
Share it