Telugu Gateway
Top Stories

చైనాకు మరో సారి వార్నింగ్

చైనాకు మరో సారి వార్నింగ్
X

అమెరికా చరిత్ర లో ఏ అధ్యక్షుడు చేయని రీతిలో డోనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని పలు దేశాలను బహిరంగంగా బెదిరించే పని చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన వాణిజ్య సుంకాల విషయంలో ఎవరైనా సరే తన మాట వినాల్సిందే అన్నట్లు గత కొంత కాలంగా వ్యవహరిస్తూ పోతున్నారు. డోనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు గట్టిగా కౌంటర్ ఇచ్చిన దేశాల్లో చైనా తో పాటు బ్రెజిల్ ఉన్నాయనే చెప్పాలి. ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ మరో సారి చైనాను టార్గెట్ గా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాతో తాను మంచి సంబంధాలే కోరుకుంటున్నాను అని..తమతో పోటీకి వస్తే మాత్రం చైనా వినాశనం తప్పదు అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఇప్పుడు చైనా కంటే తమ ఆధిపత్యమే ఎక్కవ అన్నారు. చైనా వాళ్ళ దగ్గర కొన్ని కార్డు లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న వాటికంటే బలమైన కార్డు లు అమెరికా దగ్గర ఉన్నాయి. ఇవి తాము వాడటం మొదలుపెడితే చైనా నాశనం అవుతుంది అన్నారు.

అయితే తాను ఆ కార్డు లతో ఆడాలనుకోవటం లేదు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య విభేదాల్లో బీజింగ్ కంటే వాషింగ్టన్ బలంగా ఉంది అన్నారు. ఈ ఏడాది చివరిలో తాను చైనాలో పర్యటించబోతున్నట్లు చెపుతూ రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండబోతున్నాయని చెప్పుకొచ్చారు. ఆటోమొబైల్, రక్షణ రంగానికి చెందిన మాగ్నెట్స్ సరఫరాను చైనా కొనసాగించాల్సిందే అన్నారు. లేకపోతే చైనాపై రెండు వందల శాతం సుంకాలు వేస్తామని హెచ్చరించారు. దాని వల్ల తమకు ఎలాంటి సమస్య రాదు అన్నారు. భారత్ విషయంలో కూడా డోనాల్డ్ ట్రంప్ ఇలాగే వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత 25 శాతం సుంకాలు విధించి ..తర్వాత రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు అని చెప్పి మరో 25 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.

దీంతో మొత్తం సుంకాలు 50 శాతానికి చేరినట్లు అయింది. బుధవారం నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు అమెరికా నోటిఫై కూడా చేసింది. డోనాల్డ్ ట్రంప్ తీరు చూస్తుంటే ఇండియా విషయంలో కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్లు కనిపించటం లేదు. మరో వైపు డోనాల్డ్ ట్రంప్ అమెరికా టెక్ సంస్థల నుంచి డిజిటల్ పన్నులు వసూలు చేసే దేశాలకు గట్టివార్నింగ్ ఇచ్చారు. ఆయా దేశాలకు అమెరికా నుంచి కంప్యూటర్ చిప్స్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్ లో ఓ పోస్టు పెట్టారు.

అమెరికా టెక్ కంపెనీలపై దాడులు చేసే దేశాలకు ఎదురొడ్డి నిలబడతామని అన్నారు.‘డిజిటల్ ట్యాక్స్‌లు, డిజిటల్ సర్వీస్ చట్టాలు, డిజిటల్ మార్కెట్ నియంత్రణలు అన్నీ అమెరికా కంపెనీలపై వివక్ష చూపించేందుకు రెడీ చేశారు. చైనా కంపెనీలకు మాత్రం ఈ దేశాలు ఎలాంటి అడ్డంకులు కల్పించట్లేదు. ఈ తీరుకు ముగింపు పడాలి. ఇలాంటి దేశాలను అప్రమత్తం చేస్తున్నా. అమెరికా కంపెనీలు మీకు డోర్ మ్యాట్స్ వంటివి కావు. అమెరికాకు, అమెరికా కంపెనీలకు సముచిత గౌరవం ఇవ్వండి లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అంటూ ట్రంప్ ప్రపంచ దేశాలపై మండిపడ్డారు.

Next Story
Share it