అమెరికా గగనతలంలో రష్యాకు నో ఎంట్రీ
రష్యాను దారికి తెచ్చేందుకు అమెరికాతోపాటు పలు దేశాలు వరస చర్యలకు పూనుకుంటున్నాయి. ప్రధానంగా ఇవి ఆర్ధికంగా ఆ దేశాన్ని నష్టం చేకూర్చే దిశగానే సాగుతున్నాయి. ఒంటరి పోరాటం చేస్తున్న ఉక్రెయిన్ కు నేరుగా సాయం చేస్తే యుద్ధం రూపు మారే ప్రమాదం ఉన్నందున ప్రతి దేశం ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగానే అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మరికొన్ని నిర్ణయాలను ప్రకటించారు. రష్యా విమానాల రాకపోకలు అమెరికా మీదుగా వెళ్లకుండా గగనతలాన్ని మూసివేసింది. ఫలితంగా రష్యా విమానాలు ఇకపై అమెరికా మీదుగా రాకపోకలు సాగించలేవు. ఇప్పటికే యూరోపియన్ యూనియన్‌లోని పలు దేశాలు కూడా రష్యా గగనతలాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం మాత్రం ఇంకా ఆగలేదు. బుధవారం మరో విడత చర్చలు సాగే అవకాశం ఉందని సమాచారం. ఉక్రెయిన్ సైన్యానికి అక్కడి ప్రజలు కూడా తోడుగా నిలబడి పోరాడుతుండటంతో ఉక్రెయిన్ సైన్యం, అక్కడి ప్రజల తెగువ చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. పలు దేశాలు రష్యా చర్చను వ్యతిరేకిస్తూ ఆర్ధికపరమైన కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించాయి.
అయినప్పటికీ పుతిన్ మాత్రం వెనకంజ వేయకుండా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను టార్గెట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగవారం కాంగ్రెస్ సంయుక్త సమావేశం 'స్టేట్ ఆఫ్ ది యూనియన్'ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు ఉంటుందని పేర్కొన్న బైడెన్.. రష్యాతో జరిగే పోరాటంలో అమెరికా మాత్రం పాల్గొనబోదని ఉద్ఘాటించారు. ఉక్రెయిన్ గడ్డపై అమెరికా బలగాలు రష్యాతో పోరాడబోవని బైడన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ సైన్యం రష్యా బలగాలను నిలువరిస్తూ వారి దాడులను తిప్పికొడుతోందని ప్రశంసించారు. రష్యా, పుతిన్‌పై రానున్న కాలంలో యుద్ద ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో పుతిన్ గెలిచినా, ఓడినా.. ఆర్థిక పరంగా, ఇతర అంశాల విషయంలో రష్యా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పుతిన్ ఓ నియంత.. అతడి అంతు చూస్తామంటూ బెడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.