మోడెర్నా వ్యాక్సిన్ కూ అనుమతి
మరో వ్యాక్సిన్ రెడీ. ఇఫ్పటికే ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగా..తాజాగా మోడెర్నా వ్యాక్సిన్ కు కూడా అనుమతి వచ్చింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కరోనా వైరస్ పై ఇది ఎంతో బాగా పనిచేస్తుందని, త్వరలోనే ఈ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం అవుతుందని తెలిపారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు మోడెర్నా వ్యాక్సిన్ కు అనుమతి లభించింది. ఇప్పటికే అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) కూడా మోడెర్నా వ్యాక్సిన్ అత్యంత సురక్షితం, సమర్ధవంతంగా పనిచేస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఫైజర్ తరహాలోనే ఈ వ్యాక్సిన్ ను కూడా అత్యవసర వినియోగానికి అనుమతి రావటంతో త్వరలోనే వ్యాక్సినేషన్ కూడా మొదలుపెట్టనున్నారు. అమెరికాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికే రెండు వ్యాక్సిన్లు కలిపి 2 కోట్ల మందికి ఇవ్వాలని నిర్ణయించారు. మోడెర్నా వ్యాక్సిన్ సమర్ధత 94 శాతం మేర ఉన్నట్లు నిర్ధారణ అయింది. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జో బైడెన్ కూడా తన తొలి ప్రాధాన్యత కరోనాను ఎదుర్కోవటమే అని ప్రకటించిన విషయం తెలిసిందే.