Telugu Gateway
Top Stories

న‌వంబ‌ర్ 8 నుంచి అమెరికా ప‌ర్య‌ట‌న‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్

న‌వంబ‌ర్ 8 నుంచి అమెరికా ప‌ర్య‌ట‌న‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్
X

రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి అయిందా? వీసా ఉంటే చాలు ఇక ఎవ‌రైనా అమెరికా వెళ్లొచ్చు. న‌వంబ‌ర్ 8 నుంచి ఈ వెసులుబాటు అందుబాటులోకి రానుంది. అయితే ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎఫ్ డిఏ), ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ వో) అత్య‌వ‌స‌ర అనుమ‌తి ఉన్న వ్యాక్సిన్ తీసుకున్న వారికే ఈ అనుమ‌తులు ల‌భిస్తాయి. దీంతో భార‌త్ లో కోవాగ్జిన్ తీసుకున్న వారు మ‌రికొంత కాలం వేచిచూడాల్సిన ప‌రిస్థితి ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త్ బ‌యోటెక్ డెవ‌ల‌ప్ చేసిన వ్యాక్సిన్ కు డ‌బ్ల్యూహెచ్ వో అనుమ‌తి ద‌క్క‌లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు ఇది వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇంత కాలం అత్య‌వ‌స‌ర అనుమ‌తులు...విద్యార్దుల‌కే ప‌రిమితం అయిన అమెరికా ప్ర‌యాణం ఇక నుంచి సాధార‌ణ స్థితికి చేర‌నుంది. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి అయిన వారు ఎవ‌రైనా అమెరికా వెళ్లొచ్చు. అయితే విమానం ఎక్కే స‌మ‌యంలోనే వ్యాక్సిన్ వేసుకున్న స‌ర్టిఫికెట్, కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. 72 గంట‌ల ముందు ఈ ప‌రీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.

క‌రోనా కార‌ణంగా 19 నెల‌లుగా అమెరికా ప‌లు దేశాల‌తో స‌రిహ‌ద్దుల‌ను మూసివేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎలాంటి క్యారంటైన్ అవ‌స‌రం లేకుండా అమెరికాలో ప‌ర్య‌టించ‌వ‌చ్చు. అమెరికా తాజా నిర్ణ‌యంతో ప‌ర్యాట‌కం ఊపందుకుంటుంద‌ని భావిస్తున్నారు. దీంతో పాటు విమాన‌యానం సాధార‌ణ స్థితికి చేరుకుంటుంద‌నే అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. భార‌త్ లో కూడా క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు చూస్తే కొత్త సంవ‌త్స‌రం నాటికి సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొనే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నాలు ఉన్నాయి. అమెరికా ఆంక్షలు స‌డ‌లించిన దేశాల్లో 26 యూరోపియ‌న్ దేశాల‌తోపాటు బ్రెజిల్, చైనా, భార‌త్, ఇరాన్, ఐర్లాండ్, సౌత్ ఆఫ్రికాలు ఉన్నాయి.

Next Story
Share it