ఏటీసీ సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు

దిగ్గజ ఐటి సంస్థ మైక్రోసాఫ్ట్ సేవల్లో నెలకొన్న అంతరాయాల కారణంగా ఇండియాలో విమాన సర్వీసులపై కొంత మేర ప్రభావం పడింది. దగ్గర దగ్గర రెండు రోజుల పాటు ఇది కొనసాగింది. మరో వైపు అమెరికా లో అయితే ఎక్కడ విమాన సర్వీసులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. అయితే దీనికి హ్యాకింగ్ కారణం కాదు అని...సాంకేతిక సమస్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు చెపుతున్నారు. ముఖ్యంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల (ఏటిసి) మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) దేశంలోని విమానాశ్రయాల నుంచి విమానాల టేకాఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో వేలాది విమానాలు గంటల కొద్దీ ఆలస్యం అయ్యాయి. పలు విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాలను ప్రభావితం చేసే కమ్యూనికేషన్ వ్యవస్థలో సమస్య తలెత్తిందని తెలిపారు. దీంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని అమెరికా విమానాశ్రయాల్లో విమానాల టేకాఫ్‌లపై తాత్కాలిక నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను పర్యవేక్షించే 22 ప్రాంతీయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాలపై ఈ సమస్య ప్రభావం చూపింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) సాంకేతిక నిపుణులు సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు. కొత్తగా విమానాల టేకాఫ్ ను నిలిపి వేసి అప్పటికే గాల్లో ఉన్న విమానాలు మాత్రం తమ ప్రయాణాన్ని కొనసాగించి గమ్యస్థానాలకు చేరుకునేందుకు అనుమతించారు. సుమారు నాలుగు గంటలకు పైగా కొనసాగిన ఈ నిషేధాన్ని ఎఫ్ఏఏ సమస్య పరిష్కారం తర్వాత ఎత్తివేసింది. దీంతో విమానాలు బయలుదేరేందుకు మళ్లీ అనుమతులు ఇచ్చారు. అయినప్పటికీ విమానాలు, సిబ్బంది వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోవడంతో సేవలు సాధారణ స్థితికి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దేశమంతటా చూసుకుంటే ఏకంగా 11000 విమానాలు ఆలస్యం అయ్యాయి. ఏకంగా వెయ్యి విమాన సర్వీసులను రద్దు చేశారు కూడా. సడన్ గా తలెత్తిన ఈ సాంకేతిక సమస్యల కారణంగా మొత్తం 15 లక్షల మంది ప్రయాణీకులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. తాజాగా పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది అని చెపుతున్నారు.



