వ్యాక్సిన్ వద్దని.. నదిలోకి దూకారు
వ్యాక్సిన్లపై అపోహలు అన్నీ ఇన్నీ కావు. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ఇవి ఒకింత తగ్గినా..తొలుత మాత్రం వ్యాక్సిన్లపై రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ డాక్టర్లు..ఇతర నిపుణులు విస్తృతంగా ప్రచారం చేయటంతో ఇప్పుడు చాలా వరకూ మార్పు వచ్చింది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు వ్యాక్సిన్ దొరికితే చాలు అన్నట్లు ఉంది పరిస్థితి. కానీ అక్కడ మాత్రం విచిత్రమైన వాతావరణం నెలకొంది. వ్యాక్సిన్ వేయటానికి వస్తున్నారని తెలిసి ఆ గ్రామంలోని ప్రజలు నదిలోకి దూకేశారు. ఉత్తరప్రదేశ్ లోని బార్బంకి గ్రామానికి చెందిన కొంత మంది సరయూ నదిలోకి దూకారు.
అయితే ప్రజలు భయపడానికి అక్కడ జరిగిన ప్రచారమే కారణం అంటున్నారు. అది వ్యాక్సిన్ కాదని..విషంతో కూడిన ఇంజెక్షన్ అని ప్రచారం జరగటంతో వారంతా భయపడి ఇలా చేశారు. ఈ వ్యవహారంపై రామ్‌నగర్ సబ్ కలెక్టర్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. కరోనా నిరోధక వ్యాక్సిన్లపై ఉన్న అపోహలే వల్లే గ్రామస్తులు ఇలా చేశారని చెప్పారు. కేవలం 14 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు.