Telugu Gateway
Top Stories

టేకాఫ్ తర్వాత ఊడిపడిపోయిన టైర్

టేకాఫ్ తర్వాత ఊడిపడిపోయిన టైర్
X

విమానం సాఫీగా వెళ్లినంతసేపు అంతా హాయిగానే ఉంటుంది. ఎప్పుడైనా..ఎక్కడైనా తేడా వస్తేనే అందులో ఉన్న ప్రయాణికుల టెన్షన్ పీక్ కు వెళుతుంది. ఒక్కో సారి గాలిలో ప్రాణాలు గాలిలోనే పోయే పరిస్థితి ఎదురవుతుంది. అమెరికా కు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమాన ప్రయాణికులు ఇదే పరిస్థితిని చవి చూశారు. దీనికి ప్రధాన కారణం విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే వెనక భాగంలోని టైర్ ఒకటి ఊడిపడిపోయింది. ఆ టైర్ కూడా విమానాశ్రమయంలోని పార్కింగ్ ప్రాంతంలో ఉన్న కార్ పై పడటంతో ఆ కారు దారుణంగా దెబ్బతిన్నది. టైర్ ఊడి పడిపోయిన విషయం గ్రహించిన పైలట్ వెంటనే లాస్ ఏంజెల్స్ ఎయిర్ పోర్ట్ లో ఈ విమానాన్ని ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు. యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 777 -200 ఫ్లైట్ శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జపాన్ లోని ఒసాకా కు బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన వెంటనే లాండింగ్ గేర్ లోని టైర్ కింద పడిపోయింది.

ఈ ఘటన సమయంలో ఈ విమానంలో 235 మంది ప్రయాణికులు...14 మంది సిబ్బంది ఉన్నారు. ఎమర్జెన్సీ లాండింగ్ చేసిన విమానంలో ప్రయాణికులను మరో విమానంలో వాళ్ళ గమ్యస్థానాలకు పంపారు. ఈ విమాన ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విచారణకు ఆదేశించింది. బోయింగ్ 777 విమానాలకు రెండు లాండింగ్ గేర్లకు ఆరు టైర్ల లెక్కన ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా టైర్లు ఊడినా, డ్యామేజ్ అయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ విమానాలు ల్యాండ్ అయ్యేలా వీటిని డిజైన్ చేశారు. ఈ విమానం టైర్ ఊడిపడిపోయినా కూడా యునైటెడ్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ కావటంతో ప్రయాణికులు అందరు ఊపిరిలో పీల్చుకున్నారు.

Next Story
Share it