మోడీ జోక్యం కోరిన ఉక్రెయిన్
రష్యా దాడులతో ఉక్రెయిన్ విలవిలలాడుతోంది. ఈ దాడులు ఆపేందుకు గల అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే రష్యా మాత్రం దూకుడుతో ముందుకు సాగుతోంది. అంతే కాదు.. ఈ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకోకుంటే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరిస్తున్నారు. అమెరికాతోపాటు పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినా పుతిన్ మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గటం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి డా. ఇగోర్ పొలిఖా భారత్ మద్దతు కోరారు. భారత్ రష్యాతో ప్రత్యేకమైన స్నేహం కలిగి ఉందని, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని భారత్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.మిత్ర దేశమైన భారత్.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను నిలువరించడానికి సాయం చేయగలదని పేర్కొన్నారు.
వెంటనే భారత్‌దేశ ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలతో మాట్లాడాలని కోరారు. ప్రపంచంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎవరి మాట వింటారో? లేదో? తెలియదు కానీ, ప్రధానిమోదీ మాటలను ఆలోచిస్తారని తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రష్యాది సైనిక చర్య కాదు.. యుద్ధమే అని భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి డా. ఇగోర్ పొలిఖా అన్నారు. రష్యా దాడుల్లో భారీగా ఉక్రెయిన్ ప్రజలు మృతి చెందారని తెలిపారు. యుద్ధ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని చెప్పారు. యుద్ధ సంక్షోభ వేళ భారత్ అండగా నిలవాలని కోరుకుంటున్నామని కోరారు. పరిస్థితులు క్షీణిస్తున్నందున ఉక్రెయిన్‌కు భారత్ మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే భారత్ మాత్రం ఈ విషయంలో ఎటువైపు మొగ్గుచూపకుండా తటస్థంగా వ్యవహరిస్తోంది. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతోంది.