Telugu Gateway
Top Stories

ట్విట్ట‌ర్ కు మ‌రోసారి నోటీసులు

ట్విట్ట‌ర్ కు మ‌రోసారి నోటీసులు
X

కేంద్రం వ‌ర్సెస్ ట్విట్ట‌ర్ వ్య‌వ‌హారం మ‌రింత ముదురుతోంది. కేంద్రం తీసుకొచ్చిన నూత‌న ఐటి చ‌ట్టాలను ట్విట్ట‌ర్ వ్య‌తిరేకిస్తోంది. ఇది ప్ర‌జ‌ల భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్చ‌ను అడ్డుకోవ‌ట‌మే అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేసింది. ట్విట్ట‌ర్ తో నీతులు చెప్పించుకునే స్థితిలో లేమంటూ కేంద్రం కూడా ట్విట్ట‌ర్ కామెంట్ల‌కు అంతే ఘాటుగా బ‌దులిచ్చింది. అయితే నూత‌న ఐటి చ‌ట్టాల అమ‌లుకు మరింత స‌మ‌యం కావాల‌ని కంపెనీ కోరింది. కేంద్రం తీసుకొచ్చిన చ‌ట్టాల ప్ర‌కారం దేశంలో అధికారుల నియామ‌కం వంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోవ‌టంతో పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ ముందు హాజ‌రు కావాల‌ని ట్విట్ట‌ర్ కు నోటీసులు జారీ చేశారు. ఈనెల 18న హాజరుకావాలని ట్విటర్‌కు పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ నోటీసులు జారీ చేసింది. ప‌లుమార్లు నోటిసులిచ్చినా తగిన వివరణ ఇవ్వడంలో ట్విటర్‌ విఫలమైందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మీటీవై) లోని సైబర్ లా గ్రూప్ కోఆర్డినేటర్ రాకేశ్ మహేశ్వరి ట్విటర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

సోషల్ మీడియా, ఆన్‌లైన్ వార్తలను దుర్వినియోగంపై కమిటీ తాజా నోటీసులిచ్చింది. జూన్ 18, శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పార్లమెంటు కాంప్లెక్స్‌లోని ప్యానెల్ ముందు హాజరు కావాలని తెలిపింది. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతతో పాటు, ఫేక్‌న్యూస్‌ నివారణపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మ‌రి ఈ నోటీసుల‌పై ట్విట్ట‌ర్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. ఫేస్ బుక్, గూగుల్ స‌హా అన్ని సంస్థ‌లు భార‌తీయ చ‌ట్టాల ప్ర‌కారం చ‌ర్య‌లు ప్రారంభించ‌గా..ట్విట్ట‌ర్ మాత్రం సాగ‌దీస్తూ పోతోంది. ఈ విష‌యంలో కేంద్రం కూడా అంతే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే కేంద్రంలోని మోడీ స‌ర్కారు త‌మ‌పై పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌ను నియంత్రించేందుకే ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌నే విమ‌ర్శ‌లూ ఉన్నాయి.

Next Story
Share it