Telugu Gateway
Top Stories

మెజారిటీ చూపిస్తేనే ప్రమాణస్వీకారం!

మెజారిటీ చూపిస్తేనే ప్రమాణస్వీకారం!
X

తమిళనాడు రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే అధినేత విజయ్ గురువారం నాడు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయటానికి అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే ఆయనకు తమిళనాడు గవర్నర్ నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీనికి ప్రధాన కారణం విజయ్ పార్టీ కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు లేకపోవటమే. తాజాగా వెల్లడైన ఫలితాల్లో టీవీకే 108 సీట్లు గెలుచుకుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే ఇందులో విజయ్ రెండు చోట్ల పోటీ చేసిన స్థానాలు ఉండటంతో ఒకటి తీసివేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 107 మాత్రమే అవుతుంది. మొన్నటి ఎన్నికల్లో డీఎంకే తో కలిసి పోటీ చేసి తమిళనాడు లో ఐదు సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం టీవీకే కు మద్దతు ప్రకటించింది. దీంతో టీవీకే కు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్య 112 కు చేరింది. ఇంకా విజయ్ పార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది. కమ్యూనిస్ట్ లు విజయ్ తో కలిసి ముందుకు సాగటానికి నో చెప్పారు.

మరో వైపు ఏఐఏడీఎంకె కూడా విజయ్ కు మద్దతు గా నిలవకూడదు అని అధికారికంగా నిర్ణయం తీసుకుంది. డీఎంకె అందరికంటే ముందే ప్రతిపక్షంలో కూర్చోవటానికి సిద్ధం అయింది. దీంతో ఇప్పుడు విజయ్ కు మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరు అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మెజారిటీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖ అందిస్తే తప్ప తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కొత్త సర్కారు ఏర్పాటుకు అనుమతి ఇచ్చే సూచనలు కనిపించటం లేదు. బుధవారం నాడు తనను కలిసిన విజయ్ వద్ద కూడా గవర్నర్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సంఖ్య బలం చూపించిన తర్వాతే ప్రమాణస్వీకారం అనే సంకేతాలు ఇచ్చినట్లు చెపుతున్నారు. అయితే టీవీకే మాత్రం తమకు ఛాన్స్ ఇవ్వాలని...రెండు వారాల్లో సభలో బలనిరూపణ చేసుకుంటాము అని చెపుతోంది. ఈ వాదనతో ఏకీభవించని గవర్నర్ మెజారిటీ సభ్యుల మద్దతు లేకుండా ప్రమాణం స్వీకారం చేయించటానికి అంగీకరించలేదు. దీంతో చేసేది ఏమిలేక టీవీకే గురువారం నాడు తలపెట్టిన ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది.

వాస్తవానికి టీవీకే దీనికి కోసం అంతా సిద్ధం చేసుకుంది....ముహుర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకుంది. తాజా పరిణామాలతో విజయ్ కు బిగ్ షాక్ తగిలినట్లు అయింది అనే చెప్పాలి. ఇప్పుడు టీవీకే మొత్తం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు చూపిస్తే తప్ప గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు అనే విషయం స్పష్టం అయింది. తమిళనాడు ఎన్నికల్లో రెండు సీట్లు గెలుచుకున్న ఇండియా ముస్లిం లీగ్ కూడా టీవీకే కు మద్దతు ఇవ్వటానికి నో చెప్పింది. దీంతో ఇప్పుడు తమిళనాడు రాజకీయం రసకందాయంలో పడినట్లు అయింది. విజయ్ తనకు కావాల్సిన మద్దతు ఎలా సాదించుకునుంటారు అన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారబోతోంది. తమిళనాడు లో బీజేపీ అసలు రాజకీయం ఇప్పుడే మొదలైంది అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Next Story
Share it