మళ్ళీ దొరికిన టీవీ9 రజనీకాంత్..ఆడుకుంటున్న నెటిజన్లు
టీవీ9. ఈ మధ్య వార్తల్లో ఎక్కువ నానుతుంది. ఇది ఆ ఛానల్ ఇచ్చే ప్రత్యేక వార్తల విషయంలో కాదు సుమా. అది చేసే తప్పుల వ్యవహరంలో. కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు సంబంధించిన 'రుధిరధారల' అంశం మర్చిపోకముందే మళ్ళీ కొత్త అంశం తెరపైకి వచ్చింది. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ గా ఉన్న రజనీకాంత్ చేసిన ప్రజంటేషన్ లో పోక్సో చట్టాన్ని పదే పదే పోస్కో పోస్కో చట్టం అంటూ ప్రస్తావించారు. సైదాబాద్ లో ఆరేళ్ళ బాలిక రేప్ కు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడుగా ఉన్న రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలంగాణ పోలీసులు గురువారం ప్రకటించారు. దీంతో ప్రత్యేక స్టోరీ రన్ చేస్తూ దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నిపోక్సో కేసులు ఉన్నాయనే అంశంపై స్టోరీ రన్ చేశారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ కోసం 2012లో ఈ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ (POCSO Act ) తెచ్చారు.
రజనీకాంత్ తన ప్రజంటేషన్ లో ఒకసారి కాదు పదే పదే పోక్సో చట్టాన్ని పోస్కో పోస్కో అంటూ వ్యాఖ్యానించి సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. గతంలో ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి మరణం సమయంలో ఆయన చేసిన ఆటోస్పై వ్యవహారం ఇప్పటికీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ప్రత్యక్ష్యం అవుతూనే ఉంటుంది. రాజు ఆత్మహత్య చేసుకున్న వార్త బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా మంది నెటిజన్లు అసలు రాజు ఎలా ఆత్మహత్య చేసుకున్నాడో టీవీ9 ప్రజంటర్లు రైలు పట్టాలపై నుంచి లైవ్ కవరేజ్ ఇవ్వాలంటూ ఎవరికి వాళ్లు మార్పింగ్ పోటోలు చేసి మరీ వైరల్ చేశారు. ఇదిలా సాగుతుండగానే స్వయంగా మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఇలా పోస్కో పోస్కో అంటూ బుక్ కావటంతో మరోసారి నెటిజన్లకు ఓ కొత్త ఆయుధం ఇచ్చినట్లు అయింది.