భారత ఐటి నిపుణులకు బిగ్ షాక్

టార్గెట్ ఇండియా. ఫస్ట్ సుంకాలు. ఇప్పుడు హెచ్ 1 బీ వీసాలు. ఇదీ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తీరు. ఇవి అన్ని చూస్తుంటే ఆయన ఒక వ్యూహం ప్రకారం పని చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అమెరికా కంపెనీలు అయినా..ఇండియన్ కంపెనీలు అయినా భారత ఐటి నిపుణలను ఎందుకు హెచ్ 1 బీ వీసాల కింద అమెరికా తీసుకెళతాయి అంటే తక్కువ వేతనాలు. హెచ్ 1 బీ కింద తీసుకెళ్లే నిపుణల కంటే అమెరికాకు చెందిన వాళ్ళను నియమించుకుంటే ఆయా కంపెనీలు భారీ మొత్తంలో వేతనాలు చెల్లిచాల్సి ఉంటుంది. పైగా పని గంటల విషయంలో కూడా అమెరికన్లు పక్కాగా వ్యవహరిస్తారు. అదే ఇండియా నుంచి లేక మరో దేశం నుంచి కేవలం ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన వాళ్ళు పని గంటల విషయంలో పెద్దగా పట్టించుకోరు..కంపెనీ టార్గెట్స్ ప్రకారం పని చేయటానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే పలు ఐటి కంపెనీలు పెద్ద ఎత్తున ఇండియా నుంచి సాధ్యమైనంత ఎక్కువ మందిని హెచ్ 1 వీసాల కింద తీసుకువెళ్లి పని చేయించుకుంటాయి. దీంతో అమెరికన్లకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయనేది అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ గొడవ.
అందుకే తమ వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాల్లో తీసుకోండి..లేకపోతే ఒక్క హెచ్ 1 బీ వీసా కింద సంవత్సరానికి లక్ష డాలర్లు ఫీజు చెల్లించండి అంటూ కొత్త నిబంధన అమల్లోకి తెచ్చారు. లక్ష డాలర్లు అంటే మన కరెన్సీ లో ఈ మొత్తం దగ్గర దగ్గర 90 లక్షల రూపాయలు అవుతుంది. కనీసం మూడేళ్లకు ఇలాంటి వాళ్ళను తీసుకెళ్లాలంటే కంపెనీ కేవలం ఈ ఫీజు కిందే ఏకంగా 2 . 70 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వీసా కింద తీసుకెళ్లే ఐటి నిపుణిడికి ఇచ్చే వేతనంతో పాటు ఈ ఫీజు ను కూడా లెక్కించుకుని కంపెనీలు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గత కొంత కాలంగా ఖర్చులు తగ్గించుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగాలను తొలగిస్తున్న దిగ్గజ ఐటి సంస్థలు ఇప్పుడు హెచ్ 1 బీ వీసా ఫీజు కింద ఇంత భారీ మొత్తం లో చెల్లించటానికి సిద్ధం అవుతాయా అంటే కష్టమే అని చెప్పాలి.
డోనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయంతో ఐటి కంపెనీలు అసాధారణ ప్రతిభ ఉన్న వాళ్ళను మాత్రమే ఇంత మొత్తంలో ఫీజు చెల్లించి అమెరికా తీసుకెళ్లి ఉద్యోగం చేయించుకుంటాయి అని..ఇప్పుడు ఇస్తున్నంత ఉదారంగా రాబోయే రోజుల్లో కంపెనీలు ఈ వీసాల విషయంలో వ్యవహరించే అవకాశం ఉండదు అని చెపుతున్నారు. డోనాల్డ్ ట్రంప్ కొత్తగా అమల్లోకి తెచ్చిన ఈ విధానం ముఖ్యంగా భారతీయ ఐటి నిపుణలకు పెద్ద దెబ్బగానే చెప్పాలి. ఎందుకంటే అమెరికా ప్రతి ఏటా మంజూరు చేసే హెచ్ 1 బీ వీసాల్లో దగ్గర దగ్గర 70 శాతం వరకు ఇండియాకు చెందిన నిపుణులే దక్కించుకుంటున్నారు. ఇండియా తర్వాత స్థానంలో చైనా ఉంది అని చెపుతున్నారు. ఇప్పటికే ఒక వైపు కాలేజీల్లో ప్రవేశాల విషయంలో కఠిన ఆంక్షలు విధిస్తూ వచ్చిన ట్రంప్ భారతీయ నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకోవద్దు అంటూ కూడా కొద్దిరోజుల క్రితం బహిరంగంగా చెప్పిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు అందులో భాగంగానే అన్నట్లు హెచ్ 1 వీసా ఫీజు ను ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు పది లక్షల డాలర్లు కడితే గోల్డ్ కార్డు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ గోల్డ్ కార్డు ద్వారా 100 బిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. హెచ్ 1 బీ వీసాల ఫీజు పెంపు. గోల్డ్ కార్డు వివరాలను అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లూటీనిక్ వెల్లడించారు. ఇప్పటికే ఈ విషయాలను అమెరికా లోని దిగ్గజ ఐటి కంపెనీలకు సమాచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే భారత్ విషయంలో డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య సుంకాల కూడా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇండియా, బ్రెజిల్ లపైనే ట్రంప్ ఇంత భారీ మొత్తంలో అంటే 50 శాతం సుంకాలు విధించారు.



