Telugu Gateway
Top Stories

ఇండియా పై మరో 25 శాతం సుంకాలు

ఇండియా పై మరో  25 శాతం సుంకాలు
X

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో ఏ దేశం మీద ఫోకస్ పెట్టనంతగా ఇండియాపైనే పెట్టినట్లు కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన చేస్తున్న పనులు అన్నీ కూడా టార్గెట్ ఇండియాగానే సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఒక వైపు భారత ప్రధాని మోడీ తనకు ఎంతో మంచి స్నేహితుడు అని చెపుతూ ఇప్పుడు ఇండియా పై వరుసపెట్టి సుంకాల బాదుడుతో డోనాల్డ్ ట్రంప్ కలకలం రేపుతున్నారు. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు ఇప్పుడు అదనంగా భారత్ పై మరో 25 శాతం సుంకాలు విధించారు. ఇప్పటికే ప్రకటించిన 25 శాతంతో కలుపుకుంటే ఈ మొత్తం 50 శాతం అవుతుంది. కొత్తగా ప్రకటించిన 25 శాతం సుంకాలు ఆగస్ట్ 27 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో పేర్కొన్నారు. ఈ లోగా రెండు దేశాల మధ్య ఏదైనా ఒప్పందం జరిగితే ఓకే . లేదంటే ఇండియా ఎగుమతి చేసే వస్తువులపై 50 శాతం సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. రష్యాతో భారత్ సన్నిహితంగా ఉండడం యూఎస్ దేశాధ్యక్షుడికి ఏ మాత్రం రుచించడం లేదు.

రష్యా నుంచి చౌకగా చమురును భారత్ కొనుగోలు చేస్తోంది. ఈ చమురు భారత్ మళ్లీ విక్రయిస్తుంది. తద్వారా బహిరంగ మార్కెట్‌లో చమురు విక్రయించడం ద్వారా భారత్ లాభాలు గడిస్తుందంటూ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తన అక్కసు వెళ్లగక్కారు.దీంతో భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని ఆయన ప్రకటించారు. భారత్ కోనుగోలు చేస్తున్న చమురు కారణంగా రష్యాకు భారీగా నిధులు వస్తున్నాయని ఆరోపించారు. ఆ నిధులతోనే ఉక్రెయిన్ ‌పై రష్యా యద్ధం చేస్తుందంటూ విమర్శించారు. ఆ క్రమంలో భారత్‌పై భారీగా సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటన చేశారు. ఆ క్రమంలోనే ట్రంప్ తాజాగా మరో 25 శాతం సుంకాల విధింపు నిర్ణయం తీసుకున్నారు. భారత్‌ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపై రిపబ్లికన్ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఆ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ అయితే ట్రంప్‌కు కీలక సూచనలు కూడా చేశారు. భారత్ లాంటి బలమైన మిత్ర దేశంతో అమెరికా తన సంబంధాలను దెబ్బ తీసుకోకూడదని ఆమె హితవు పలికారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు కానీ చైనా అదే పని చేయవచ్చా? అంటూ ఆమె తన ఎక్స్ ఖాతా వేదికగా ట్రంప్‌ను ప్రశ్నించారు. రష్యా నుంచి చైనా అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తుందన్నారు. చైనాకు పలు అనుమతులు ఇస్తూ.. భారత్ లాంటి బలమైన మిత్ర దేశానికి ప్రతీకార సుంకాలు పెంచి దూరం చేసుకోవద్దని ట్రంప్‌కు ఆమె హితవు పలికారు. అమెరికా ప్రెసిడెంట్ మరో సారి భారత్ పై 25 సుంకాలు విధిస్తూ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇప్పటికైనా ప్రధాని మోడీ దైర్యం తెచ్చుకుని ట్రంప్ చర్యలకు తగు సమాధానం ఇవ్వాలని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. మోడీ ఫ్రెండ్ ఇండియాపై సుంకాలను 50 శాతానికి పెంచారు అని ఎద్దేవా చేసింది.

Next Story
Share it