ఈ సుంకాల పిచ్చికి మందు లేదా!

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో బెదిరిస్తున్నా కూడా ఫార్మా రంగం జోలికి రాకపోవచ్చు అని అందరూ భావించారు. దీనికి ప్రధాన కారణం ఫార్మా కంపెనీలపై కూడా సుంకాలు విధిస్తే అంతిమంగా ఈ ప్రభావం కచ్చితంగా ఈ దేశ ప్రజలపై కూడా పడుతుంది కాబట్టి. పెరిగిన సుంకాల్లో కంపెనీలు ఎంతో కొంత కచ్చితంగా వినియోగదారులకు బదలాయించకతప్పదు . దీని వల్ల రేట్లు పెరగటం ఖాయం. ఈ కోణంలోనే డోనాల్డ్ ట్రంప్ ఫార్మా రంగం వైపు వెళ్లరని ఎక్కువ మంది భావించారు. కానీ డోనాల్డ్ ట్రంప్ కదా...ఆయన అమెరికా ప్రజలపై పడే భారం గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఇప్పుడు ఫార్మా రంగంపై కూడా పడ్డారు. తాజాగా ఇదే విషయం వెల్లడిస్తూ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ పెట్టారు. ఏకంగా ఎంపిక చేసిన ఫార్మా ఉత్పత్తులపై వంద శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఇప్పుడు భారతీయ మార్కెట్లలో ప్రకంపనలు రేపుతోంది. ఎందుకంటే ఇండియా నుంచి ఎగుమతి అయ్యే ఫార్మా ఉత్పత్తుల్లో ఎక్కువ అమెరికా మార్కెట్లకు వెళతాయి.
దీంతో డోనాల్డ్ ట్రంప్ తాజాగా విధించిన సుంకాల ప్రభావం భారతీయ ఫార్మా కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపించబోతున్నది. డోనాల్డ్ ట్రంప్ ప్రకటన వచ్చిన వెంటనే దేశీయ స్టాక్ మార్కెట్లలో ఫార్మా కంపెనీల షేర్లు భారీ నష్టాలను నమోదు చేసుకున్నాయి. డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఎంత ఊగిసలాటలో ఉంటాయో అందరికి తెలిసిన విషయమే. మరి ఫార్మా పై వంద శాతం సుంకాల విషయంలో చివరి వరకు ఇదే మాటపై ఉంటారా మధ్యలో ఏమైనా మార్పులు ఉంటాయా అన్నది వేచిచూడాల్సిందే. ఇప్పటికే ఇండియా పై డోనాల్డ్ ట్రంప్ గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫార్మా పై మరో సారి సుంకాల కత్తి ఝులిపించారు. అక్టోబర్ 1, 2025 నుంచి, బ్రాండెడ్, పేటెంటెడ్ ఔషధ ఉత్పత్తులపై 100% టారిఫ్ విధిస్తామన్నారు.
కంపెనీ అమెరికాలో తమ ఔషధ ఫ్యాక్టరీ ఉంటే, ఆ టారిఫ్ మినహాయించబడుతుంది అన్నారు. ఇప్పటికే అమెరికా లో సదరు కంపెనీ పనులు ప్రారంభించినా..కంపెనీ నిర్మాణ దశలో ఉన్న అలాంటి కంపెనీల విషయంలో ఎలాంటి సుంకాలు ఉండవన్నారు. ఫార్మా రంగంతో పాటు కిచెన్ క్యాబినెట్లు, బాత్‌రూమ్ వానిటీలపై 50% డ్యూటీ, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌పై 30%, హెవీ ట్రక్కులపై 25% టారిఫ్‌లు ప్రకటించారు. ఇవన్నీ అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి అని తెలిపారు. ఒక వైపు భారత్ తో సుంకాల అంశంపై చర్చలు జరుపుతూ ఇప్పుడు సడన్ గా ఫార్మా రంగంపై ఏకంగా వంద శాతం సుంకాలు ప్రకటించటం వెనక డోనాల్డ్ ట్రంప్ ఎజెండా ఏమై ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. ఇండియా నుంచి ప్రతి ఏటా ఫార్మా ఎగుమతులు దగ్గర దగ్గర 30 బిలియన్ డాలర్లు ఉంటాయి. ఇందులో ఒక్క అమెరికా మార్కెట్ కే ఇండియా నుంచి 9 బిలియన్ డాలర్ల వరకు ఉంటాయి. ఈ లెక్కల ప్రకారం డోనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఇండియా ఫార్మా రంగంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.



