Telugu Gateway
Top Stories

ప్రాజెక్ట్ ఫ్రీడమ్ కు బ్రేక్

ప్రాజెక్ట్ ఫ్రీడమ్ కు బ్రేక్
X

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ఇరాన్ దారికి తెచ్చుకుంటుందా?. ట్రంప్ ఎందుకు సడన్ గా హర్ముజ్ జలసంధిలో ప్రకటించిన 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ని నిలిపివేశారు. దీన్ని కొనసాగిస్తే ఇరాన్ దాడులకు దిగితే మరింత పరువు పౌతుంది అనే భయంతోనే వెనక్కి తగ్గారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాల్పుల విరమణ అమల్లో ఉన్నా కూడా ఇటీవల యూఏఈ పై ఇరాన్ వరసగా దాడులకు దిగింది. డ్రోన్స్ తో పాటు క్షిపణులను ప్రయోగించింది. ఇది ఉద్రిక్తలను మరింత పెంచటంతో పాటు పలు దేశాలు ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించాయి కుడా. అయినా సరే డోనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై పెద్దగా స్పందించకుండా ఇప్పుడు సడన్ గా హర్ముజ్ లో నిలిచిపోయిన నౌకలను ఆయా దేశాలకు పంపేలా ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది మానవతా దృక్పధంతో చేస్తున్నట్లు కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం పాకిస్థాన్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డోనాల్డ్ ట్రంప్ చెపుతున్నారు. ఇరాన్ తో యుద్ధం ముగిసింది అని కొద్దిరోజుల క్రితం డోనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ఈ లెక్కన అమెరికా ఇప్పటికిప్పుడు మరోసారి నేరుగా ఇరాన్ పై పూర్తి స్థాయి యుద్దానికి దిగే అవకాశాలు కూడా ఉండవు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే డోనాల్డ్ ట్రంప్ తన పరువు కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. ఎవరూ ఊహించని రీతిలో డోనాల్డ్ ట్రంప్ తాజాగా తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా హర్ముజ్ జలసంధిలో చేపట్టిన 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ ప్రతినిధులతో తుది ఒప్పందం దిశగా గొప్ప పురోగతి సాధించామని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌తో శాంతి చర్చలకు అవకాశం కల్పించేందుకు కొద్దికాలం పాటు 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని తెలిపారు. మరో వైపు ఇరాన్‌పై అమల్లో ఉన్న నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించేందుకు అమెరికా సైన్యం 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ప్రకటించగా ... దీనిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్ట్ అమలు అయితే పరిస్థితి చేయిదాటిపోయే అవకాశం ఉండటంతో అమెరికా కూడా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో అద్భుత సైనిక విజయం సాధించాం అని ప్రకటించుకున్నారు డోనాల్డ్ ట్రంప్. మరి ఈ సారి అయినా శాశ్వత ఒప్పందం కుదిరి యుద్దానికి శాశ్వత ముగింపు పడుతుందా లేదా అన్నది తేలాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఓవల్ ఆఫీస్ లో మీడియా తో మాట్లాడుతూ తాము పూర్తి స్థాయిలో యుద్దానికి దిగితే ఇరాన్ దాన్ని ఆపలేదు అని వ్యాఖ్యానించారు. కొత్తగా యురేనియం శుద్ధిని నిలిపివేయడంతో పాటు ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం తమకు అప్పగించాలని అమెరికా పట్టుపడుతోంది. చర్చలకు ఇదే ప్రధాన అడ్డంకిగా మారినట్లు కనిపిస్తోంది.

Next Story
Share it