రెండు వారాలే గడువు

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్లాలో అర్ధం కావటం లేదు. కొద్ది రోజుల క్రితం అలస్కా లో పుతిన్ తో భేటీ అయిన ట్రంప్ ఒక ఒప్పందానికి రాలేకపోయినా కూడా తమ మధ్య సమావేశం మాత్రం మంచిగా జరిగింది అని చెప్పారు. ఆ తర్వాత వైట్ హౌస్ లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ తో కూడా సమావేశం అయ్యారు. అయినా కూడా రష్యా ప్రెసిడెంట్ పుతిన్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ ల మధ్య ముఖాముఖీ భేటీ ఏర్పాటు చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏమి ఫలిస్తున్న దాఖలాలు లేవు. డోనాల్డ్ ట్రంప్ తో భేటీ తర్వాత కూడా రష్యా ఉక్రెయిన్ పై పెద్ద ఎత్తున దాడులు చేస్తూనే ఉంది. దీంతో తాజాగా రష్యా తీరుపై డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు వారాల్లో ఈ యుద్ధం ముగింపునకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటాను అని...అప్పటికి రష్యా దారికి రాకపోతే భారీ ఆంక్షలతో పాటు సుంకాలు కూడా విదిస్తానని ప్రకటించారు. ఈ సమయంలో పుతిన్, జెలెన్‌స్కీ లపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్-జెలెన్‌స్కీ లు నూనె, వెనిగర్ లాంటి వాళ్ళు అని ఇవి రెండు కలవటం ఎంత కష్టమో......వీళ్ళను కలపటం కూడా అంతే కష్టం అన్నారు.
యుద్ధం ముగింపు విషయంలో వీళ్ళు ఇద్దరూ కలిసి పని చేస్తారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు అన్నారు. ఉక్రెయిన్ లో అమెరికా ఫ్యాక్టరీ పై రష్యా దాడి చేయటం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం వంటిదే అన్నారు. సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధం ముగింపు కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా కూడా వాళ్ళు ఏ మాత్రం సహకరించటం లేదు అన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపితే తాను స్వర్గానికి పోతాను అంటూ ఇటీవల డోనాల్డ్ ట్రంప్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. అమెరికా ఎన్నికల ముందు ఒక సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. దీని నుంచి ఆయన తృప్తి లో తప్పించుకున్నారు. అప్పటిలో కూడా ఆయన దేవుడే తనను రక్షించాడు ...అమెరికా ను మరో సారి సమున్నతంగా నిలబెట్టేందుకు అని చెప్పారు.



