Telugu Gateway
Top Stories

చైనాపై వంద శాతాలు సుంకాలు విధింపు

చైనాపై వంద శాతాలు సుంకాలు విధింపు
X

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు మళ్ళీ తిక్కరేగింది. ఈ సారి చైనాపై ఆ తిక్క చూపించారు. ఇప్పటికే ఇండియాపై ఏకంగా 50 సుంకాలు విధించిన ట్రంప్ ..చైనా విషయంలో మరింత దూకుడు చూపించారు. డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలపై భారత్ ఎక్కడా ఎదురుదాడి చేయకుండా తన పని చేసుకుంటూ పోతోంది. చైనా అలా కాకుండా అమెరికా కు సవాళ్లు విసురుతోంది. డోనాల్డ్ ట్రంప్ ఈ సుంకాల యుద్ధం ప్రారంభించనప్పటి నుంచి చైనా అదే వైఖరి అనుసరిస్తోంది. మధ్యలో ఒక సారి చైనా విషయంలో డోనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గారు. కానీ మళ్ళీ ఇప్పుడు చైనాపై అదనంగా వంద శాతం సుంకాలు విధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో ఇప్పటికే వేధించిన 30 శాతం తో కలుపుకుంటే మొత్తం సుంకాలు 130 శాతానికి చేరినట్లు అయింది. పెంచిన సుంకాలు నవంబర్ ఫస్ట్ నుంచి లేదా అంతకంటే ముందే అమల్లోకి రావొచ్చు అని చెప్పుకొచ్చారు.

అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా పలు ఆంక్షలు విధించడం తాజాగా ట్రంప్ ఆగ్రహానికి కారణం అయింది. అందుకు ప్రతిగానే చైనాపై టారిఫ్ వార్‌కు తెర తీశారు. అక్టోబర్ చివర్లో జరిగే ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసి చర్చలు జరపాలని ట్రంప్ భావించారు. తాజా పరిణామాల నేపథ్యంలో జిన్‌పింగ్‌తో చర్చలు చేయడంలో అర్థం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ టారిఫ్‌లకు ప్రతిగా చైనా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటే ఈ నెల నుంచే టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని ట్రంప్ హెచ్చరించారు.చైనాలో విచిత్రమైన విషయాలు చోటు చేసుకుంటున్నాయి అని ఆరోపించారు ట్రంప్.

అరుదైన ఖనిజాలపై పలు ఆంక్షలు విధించాలనుకుంటున్నారు. దీనిపై ప్రపంచం మొత్తానికి లేఖలు పంపుతున్నారు. చైనా నిర్ణయం మినహాయింపు లేకుండా అన్ని దేశాలను ప్రభావితం చేస్తుంది. చైనాతో మేం కొంతకాలంగా మంచి సంబంధాలే కొనసాగిస్తున్నాం. అయినప్పటికీ వారి తీరు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ దేశం ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించాలని నిర్ణయించాం అన్నారు. అమెరికా తయారు చేసి ప్రతి ఉత్పత్తిపైనా చైనా భారీ గా సుంకాలు విధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు అందిన నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నారు. చైనాపై వంద శాతం సుంకాలు విధిస్తూ డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయటంతో అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. ఈ ఒక్క దెబ్బకే ఏకంగా లక్షన్నర కోట్ల మేర సంపద హరించుకుపోయినట్లు వార్తలు వచ్చాయి. డోనాల్డ్ ట్రంప్ చైనాపై విధించిన సుంకాల విషయంలో చివరి వరకు ఇదే స్టాండ్ తో ఉంటారా లేక మధ్యలో తన నిర్ణయాన్ని మార్చుకుంటారు అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it