Telugu Gateway
Top Stories

ఇజ్రాయిల్-హమాస్ లకూ తనదైన మోడల్ ఝలక్ !

ఇజ్రాయిల్-హమాస్ లకూ తనదైన మోడల్ ఝలక్ !
X

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఎవరినైనా సరే బెదిరించి పని చేసుకోవాలనే మోడల్ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఈ విషయంలో ఏ మాత్రం మొహమాటం లేకుండా వ్యవహరిస్తున్నారు అనే చెప్పాలి. కొన్ని సార్లు ఇది వర్క్ అవుట్ అవుతోంది..మరి కొన్ని సార్లు రివర్స్ కొడుతోంది. వాణిజ్య సుంకాల దగ్గర నుంచి పలు విషయాల్లో డోనాల్డ్ ట్రంప్ తీరుపై పలు విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సుంకాల విషయంలో చైనా ఒక్కటే గట్టిగా కౌంటర్లు ఇవ్వటంతో అమెరికానే వెనక్కి తగ్గింది. ఇండియాపై అయితే ఏకంగా 50 శాతం సుంకాలు విధించి పలు రకాలుగా ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు డోనాల్డ్ ట్రంప్. రెండు దేశాల మధ్య చర్చలు సాగుతున్నా ఇవి మాత్రం తుది దశకు చేరుకోవటం లేదు. ఇది ఇలా ఉంటే ఇజ్రాయిల్-హమాస్ లు తొలి దశ శాంతి ఒప్పందానికి అంగీకరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో డోనాల్డ్ ట్రంప్ ఎంతో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా డోనాల్డ్ ట్రంప్ తాము ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి ఓకే చెపితే సరే లేదు అంటే హమాస్ గతంలో ఎన్నడూ చూడని రక్తపాతం చూడాల్సి ఉంటుంది అని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఒక్క హమాస్ విషయంలోనే కాదు..అమెరికా కు ఎంతో సన్నిహితంగా ఉండే ఇజ్రాయిల్ విషయంలో కూడా డోనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరించి ఈ ఒప్పందాన్ని లైన్ లో పెట్టినట్లు చెపుతున్నారు. ఒక వైపు నోబెల్ శాంతి బహుమతి కోసం తహ తహ లాడుతున్న డోనాల్డ్ ట్రంప్ దీనికి సంబంధించిన ప్రకటన రావటానికి కొద్ది గంటల ముందు ఇజ్రాయిల్-హమాస్ ల గాజా శాంతి ఒప్పందానికి శ్రీకారం చుట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి డోనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నట్లు ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందా రాదా అన్నది కొద్ది గంటల్లోనే తేలనుంది. దీని కోసం డోనాల్డ్ ట్రంప్ హమాస్ ను బెదిరించడంతో పాటు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు పై కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చి తాను అనుకున్న పని పూర్తి చేశారు అని తాజాగా వార్తలు బయటకు వచ్చాయి. ఈ విషయంలో ఏకంగా బెంజిమెన్ నెతన్యాహు ను ప్రైవేట్ గా బెదిరించారు అని చెపుతున్నారు. ఈ డీల్ ఖరారు కాగానే గాజా యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్, హమాస్‌లు ముందుకొచ్చాయని, మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

శాంతి ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేసినట్టు తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా వెల్లడించారు. గత కొన్నేళ్లుగా జరుగుతున్న గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇదొక అపూర్వమైన అడుగు అని పేర్కొన్నారు. ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు, హమాస్ నాయకత్వం కూడా స్పందించింది. గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని హమాస్ నాయకత్వం అభిప్రాయపడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపింది. మరోవైపు, ఈ శాంతి ఒప్పందం ఇజ్రెయెల్‌కు ఎంతో మంచి చేస్తుందని బెంజిమన్ నెతన్యాహు అన్నారు. ఈ ఒప్పందాన్ని ఆమోదించేందుకు, బందీలను ఇళ్లకు చేర్చేందుకు ప్రభుత్వాన్ని సమావేశపరుస్తానని పేర్కొన్నారు.'మొదటి దశ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించినందుకు గర్వంగా ఉంది . దీర్ఘకాలిక శాంతిని సాధించే క్రమంలో సైనికుల ఉపసంహరణ తొలి అడుగుగా నిలుస్తుంది. అమెరికా, అరబ్ ప్రపంచం, ముస్లిం దేశాలు, ఇజ్రాయెల్, చుట్టుపక్కల దేశాలకు ఇది చాలా మంచి రోజు. ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన ఖతార్, ఈజిప్ట్, టర్కీ‌కు ధన్యవాదాలు అని ట్రంప్ పేర్కొన్నారు.

Next Story
Share it