అందుకే స్వరం మారుతోంది

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ లు లెక్కలు తప్పుతున్నాయి . ఇండియా తో పాటు రష్యా విషయంలో కూడా ఆయన వేసుకున్న అంచనాలు అన్నీ ఘోరంగా విఫలం అయ్యాయి. అగ్రరాజ్యం అయినంత మాత్రాన అందరూ తాను చెప్పినట్లే వింటారు అనుకున్నాడు డోనాల్డ్ ట్రంప్. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి మాత్రం వ్యవహారం అంతా రివర్స్ కొడుతోంది. ముఖ్యంగా భారత్ తాను చెప్పినట్లు వినటం లేదనే అక్కసుతో అత్యధికంగా ఇండియాపై 50 శాతం సుంకాలు విధించి దారికి తెచ్చుకోవాలని చూశారు. అయితే భారత్ ఈ విషయంలో ఎక్కడా రాజీధోరణి చూపించకపోవటంతో ఇప్పుడు ఆయనే మెత్తపడుతున్నట్లు కనిపిస్తోంది. డోనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మోడీ గొప్ప ప్రధాని అని ప్రశంసిస్తూ...తనకు వ్యక్తిగతంగా కూడా ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి అని ప్రకటించారు. అయితే రష్యా నుంచి ఇండియా పెద్ద ఎత్తున ఆయిల్ కొనుగోళ్లు చేయటం తనకు నచ్చలేదు అన్నారు. మరో వైపు భారత్ పై విధించిన 50 శాతం సుంకాలు ఎక్కువే అని అంగీకరించారు.
భారత్-అమెరికా మధ్య ప్రత్యేకమైన సంబంధం ఉంది అని..ఇండియా తో సంబంధాల పునరుద్దరణకు తాను సిద్ధంగానే ఉన్నట్లు ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలపై భారత ప్రధాని మోడీ కూడా వెంటనే స్పందించారు. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడూతూ ఆయన సానుకూల వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అమెరికా-భారత్ లు మంచి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగిఉన్నాయని...రెండు దేశాల సంబంధాల విషయంలో ట్రంప్ భావాలూ..సానుకూల దృక్పధాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. డోనాల్డ్ ట్రంప్ దూకుడు కు చెక్ పెట్టేందుకు ఇండియా కూడా అంతే వేగంగా ఒక వైపు రష్యా తో పాటు చైనా తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేసింది. ఇది కూడా ట్రంప్ వైఖరిలో మార్పునకు కారణంగా కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. ఈ మూడు దేశాలు కలిసి పనిచేస్తే భవిష్యత్ లో తమ అధిపత్యానికి గండి పడుతుంది అనే భయంలో ట్రంప్ ఉన్నారు అని చెపుతున్నారు.
ఇదే కాకుండా ట్రంప్ కు మరో కీలక విషయంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది అనే చెప్పాలి. అదే సుదీర్ఘకాలంగా సాగుతున్న రష్యా -ఉక్రెయిన్ యుద్ధం తాను రంగంలోకి దిగితే చాలు యుద్ధం అలా ఆగిపోతుంది అని కలలు కన్న డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వాస్తవంలోకి వచ్చారు. తాను అధికారంలోకి వస్తే ఈ యుద్ధం ఆపటం ఎంతో ఈజీ అనుకున్నాను అని..కానీ ఇది ఎంతో సంక్లిష్టమైన యుద్ధంగా అభివర్ణించారు. ఈ యుద్ధం ఆపే విషయంలో తాను గతంలో ఇచ్చిన హామీని అమలు చేయలేకపోతున్నట్లు చెప్పుకొచ్చారు. గత ఏడు నెలల కాలంలో తాను చేసినట్లు ఎవరూ చేయలేదు అని..ఏకంగా ఏడు యుద్దాలు ఆపినట్లు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్దాన్ని మాత్రం ఆపలేకపోయినట్లు ఒప్పుకున్నారు. అమెరికా కాంగ్రెస్ సభ్యులకు వైట్ హౌస్ లో విందు ఇచ్చిన సందర్భంగా మాట్లాడుతూ డోనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తో తనకున్న స్నేహం కారణంగా ఈ యుద్ధం ఈజీగా ఆపగలనని భావించాను అని...కానీ ఇది కష్టతరంగా మారింది అన్నారు. కొద్ది రోజుల క్రితమే అలస్కా లో డోనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ లు భేటీ అయి చర్చించినా కూడా ఈ విషయంలో ఒక పరిష్కార మార్గం దొరకలేదు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం యుద్ధం ఆపకపోతే రష్యా పై భారీ ఎత్తున సుంకాలు విధించటంతో పాటు మరిన్ని ఆంక్షలు విదిస్తానని ప్రకటించారు. అయినా రష్యా పెద్దగా వీటిని పట్టించుకోలేదు. మరో వైపు పుతిన్-జెలెన్‌స్కీ ల మధ్య ముఖాముఖి భేటీ కోసం డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేసినా కూడా అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఇండియా, రష్యా ల విషయంలో డోనాల్డ్ ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.



