Telugu Gateway

టీఆర్ఎస్ కు ఎంఐఎంతో రహస్య అవగాహన

టీఆర్ఎస్ కు ఎంఐఎంతో రహస్య అవగాహన
X

హైదరాబాద్ ను ప్రపంచ ఐటి హబ్ గా మారుస్తాం

ఫాంహౌస్ నుంచి సచివాలయానికి వస్తే కెసీఆర్ కు తెలుస్తాయి

హైదరాబాద్ కు వరదలొస్తే కెసీఆర్ ఎక్కడ?

గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం బిజెపిదే

రోడ్ షోల్లో స్వాగతం చూస్తేనే అర్ధం అయింది..అమిత్ షా

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు. తమకు ఛాన్స్ ఇస్తే సుపరిపాలన అందిస్తామని, హైదరాబాద్ ను ప్రపంచ ఐటి హబ్ గా మారుస్తామని తెలిపారు. ఇవి గల్లీ ఎన్నికలు అనే వాళ్ళు ఆ గల్లీలను ఎందుకు అభివృద్ధి చేయటం లేదని ప్రశ్నించారు. ఆదివారం నాడు నగరంలోని తన రోడ్ షోలకు హాజరైన ప్రజలను చూసిన తర్వాత బిజెపి మేయర్ పీఠాన్ని దక్కంచుకోనుందని తేలిపోయిందని అన్నారు. రాజకీయాల్లో ఎవరు ఎవరితో అయినా పొత్తుపెట్టుకోవచ్చని..కానీ టీఆర్ఎస్ ఎంఐఎంతో ఎందుకు రహస్య ఒప్పందం చేసుకుందని ప్రశ్నించారు. తెలంగాణలో కెసీఆర్ ఫ్యామిలీకి తప్ప..మరెవరికీ పరిపాలనా సామర్ధ్యం లేదా అని ప్రశ్నించారు. కెసీఆర్ ఫాంహౌస్ ను వీడి సచివాలయానికి వస్తే కేంద్రం హైదరాబాద్ కు ఎంత ఇచ్చింది అన్న లెక్కలు తెలుస్తాయన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, తమ ప్రభుత్వ ఏర్పాటులో కేసీఆర్‌దే కీలక పాత్ర అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు చూస్తేనే బీజేపీ విజయం ఖాయమని తెలుస్తుందన్నారు.

నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించిన అనంతరం అమిత్ షా బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నగరానికి చేరుకున్న అనంతరం తొలుత భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాము చెప్పిందే చేస్తామని అమిత్ షా హామీ ఇఛ్చారు. గతంలో కూడా స్థానిక ఎన్నికలకు జాతీయ స్థాయి నాయకులు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయన్నారు. గతంలో కూడా కెసీఆర్ దేశమంతా తిరిగారని ఏమి అయిందని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడ కావాలనుకుంటే అక్కడకు వెళ్లొచ్చని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ గతంలో ఇచ్చిన హామీలనే అమలు చేయలేదన్నారు. టీఆర్ఎస్ వంద రోజుల ప్రణాళిక ఇచ్చి ఏమిచేసిందని, హుస్సేన్ సాగర్ ను మంచినీళ్ళుగా మార్చే కార్యక్రమం ఏమైందని ప్రశ్నించారు. నగరంలో వరదలు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సీఎం కెసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తాము హైదరాబాద్ కు ఎవరి మీద దాడులు చేయటానికి రాలేదన్నారు.

ఎంఐఎం అండతోనే అక్రమ కట్టడాలు ఏర్పాటయ్యాయని, ఎంఐఎం మార్గదర్శనంలోనే టీఆర్ఎస్ నడుస్తోందన్నారు. బీజేపీకి అవకాశమిస్తే.. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నిధులిస్తోందని, తన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. లక్ష ఇళ్లు కడతామన్నారు.. ఏమైంది? ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చలేకపోయింది. పర్యాటక కేంద్రంగా మారుస్తాం అన్నారు. ఏమయ్యాయి అవి. ప్రజలకు ఆయుష్మాన్ భారత్‌ ఫలాలు అందకుండా అడ్డుకున్నారు అంటూ విమర్శించారు. రోహ్యింగాల గురించి తాము మాట్లాడితే పార్లమెంట్ లో టీవీల సాక్షిగా గొడవ చేసింది ఎవరో అందరికీ తెలుసన్నారు. అవినీతిలో తెలంగాణ ప్రభుత్వం అన్ని సరిహద్దులు దాటేసింది అన్నారు. ఎన్నికల కోసం వచ్చాను.. కేసీఆర్‌ను కొట్టడానికి కాదు. కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో వందేళ్లు బతకాలి. అధికారం ఇస్తే హైదరాబాద్‌ను ప్రపంచానికే ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం. కేంద్రం ద్వారా హైదరాబాద్‌ చిరువ్యాపారులకు అత్యధికంగా లాభం జరిగింది.నవాబు, నిజాం సంస్కృతుల నుంచి విముక్తి చేసి..హైదరాబాద్‌ ఒక మినీ ఇండియాగా తీర్చిదిద్దుతాం' అని అమిత్‌ షా పేర్కొన్నారు.

Next Story
Share it