బ్యాంకు రుణాలన్నీ బడా బాబులకే!

దేశంలోని బ్యాంకు లు కేవలం పది మంది అంటే పది కార్పొరేట్ గ్రూపులకు-బడా పారిశ్రామిక వేత్తలకు ఏకంగా 25 .5 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు ఇచ్చాయి. అది కూడా 2022 సెప్టెంబర్ వరకు ఉన్న లెక్కల ప్రకారం. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 8 ,10 ,941 కోట్ల రూపాయలు అయితే..ప్రైవేట్ రంగ బ్యాంకుల వాటా 3 ,70,973 కోట్ల రూపాయలు, విదేశీ బ్యాంకు గ్రూపులు 88 ,998 కోట్ల రూపాయలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకు గ్రూప్ (షెడ్యూల్డ్ ) 692 కోట్ల రూపాయలు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు 12 , 71 ,604 కోట్ల రూపాయల మేర రుణాలు ఇచ్చాయి. అయితే ఆర్ బీఐ నిబంధన సెక్షన్ 45 ఈ ప్రకారం రుణగ్రహీతలు జాబితా ఇవ్వటానికి లేదని తెలిపారు.
ఎంపీ మనీష్ తివారి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరద్ ఈ విషయాలు వెల్లడించారు. పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్న వారు డిఫాల్ట్ అయినా...రుణాల చెల్లింపులో జాప్యం జరిగినా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర విధానం తెచ్చినట్లు వెల్లడించారు. అయితే నిబంధనలు ఎన్ని ఉన్న కూడా బడా బడా పారిశ్రామిక వేత్తలు వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటున్నారు...ఎగవేస్తున్నారు కూడా. కొన్నిసార్లు లక్షల కోట్ల రూపాయల రుణాలను రైట్ ఆఫ్ చేస్తున్నారు. ఇందులో తిరిగి వచ్చే మొత్తం మాత్రం చాలా చాలా నామమాత్రంగా ఉంటోంది.



