Telugu Gateway
Top Stories

ఇంట్లో ఉన్నా మాస్క్ పెట్టుకోవాల్సిందే

ఇంట్లో ఉన్నా మాస్క్ పెట్టుకోవాల్సిందే
X

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అందరినీ వణికిస్తోంది. ఇప్పుడు ఆ వయస్సు..ఈ వయస్సు అన్న బేధం లేకుండా ప్రాణాలు తీస్తోంది. దీనికి కొంత మంది నిర్లక్ష్యం కూడా కారణం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ లు ధరిస్తూ..భౌతిక దూరం పాటించటం వంటి కనీస జాగ్రత్తలు తీసుకుంటే ఈ ముప్పు నుంచి చాలా వరకూ తప్పించుకోవచ్చని అంటున్నారు. అయితే తాజాగా నీతి అయోగ్ సభ్యుడు (హెల్త్) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో ఉన్నా కూడా మాస్క్ ధరించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. కుటుంబంలో ఒకరికి కరోనా పాజిటివ్ వస్తే వ్యక్తి ఇంట్లో మాస్క్ ధరించి ఉండాల్సిందేనని..అతనితోపాటు ఇతర సభ్యులు కూడా మాస్క్ లు ధరించటం శ్రేయస్కరం అని సూచించారు.

అదే సమయంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరినీ ఇంటికి ఆహ్వానించవద్దని, బయటకు కూడా పోకుండా ఉండటం ఉత్తమం అని తెలిపారు. కరోనా అని అనుమానం వస్తే టెస్ట్ రిజల్ట్స్ వచ్చే వరకూ వేచిచూడకుండా వెంటనే ఐసోలేట్ కావాలని ఢిల్లీ ఎయిమ్స్ డైరక్టర్ రణ్ దీప్ గులేరియా సూచించారు. అనవసరంగా ఎవరూ భయాందోళనలకు గురికావద్దని సూచించారు. మాస్క్ లు ధరించినప్పుడు వ్యక్తుల మధ్య కోవిడ్ వ్యాప్తి చెందటం చాలా తక్కువ అని వైద్య శాఖ అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించారు.

Next Story
Share it