Telugu Gateway
Top Stories

అన్ని ఇళ్ళు ఏమి చేసుకుంటారో!

అన్ని ఇళ్ళు ఏమి చేసుకుంటారో!
X

భారత్ వంటి దేశంలో మెజారిటీ ప్రజలు తమ జీవిత కాలంలో ఒక ఇళ్ళు కొనుక్కోవటమే గగనం. ఎలా గోలా కష్టపడి కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఎక్కువ మొత్తం బ్యాంకు లోన్ తీసుకుంటే తప్ప ఆ ఒక్క ఇళ్ళు కొనటం కూడా సాధ్యం కాదు. ఆ ఇంటి అప్పు తీర్చటానికి సంవత్సరాలకు సంవత్సరాలు పడుతుంది. అయితే ఇప్పుడు ఐటి తో పాటు పలు విభాగాల్లో జీతాలు గణనీయంగా పెరిగినందున కొంత మంది రెండు, మూడు ఇళ్ళు కూడా కొంటున్నారు. ఇక సంపన్నుల సంగతి వేరే విషయం. ఎక్కువ డబ్బులు ఉన్న వారు తమకు నచ్చిన ప్రాంతంలో. భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయి అనుకుంటే పెట్టుబడి కోణంలో కూడా పెద్ద ఎత్తున ఇళ్ళు, అపార్ట్ మెంట్స్ కొనుగోలు చేస్తున్నారు. కీలక ప్రాజెక్ట్ లు స్టార్ట్ అవుతున్న సమయంలో ఫ్లాట్స్ బుక్ చేసుకుని...పూర్తిగా రెడీ అయిన తర్వాత అమ్ముకుని లాభాలు దక్కించుకోవాలనే స్పెక్యులేటర్స్ కూడా గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పెరిగారు. ఇది అంతా మన మార్కెట్ పరిస్థితి. దక్షిణ కొరియా కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది.

అదేంటి అంటే...30 మంది వ్యక్తులు ఐదున్నర సంవత్సరాల కాలంలో ఏకంగా 8000 ఇళ్ళు కొనుగోలు చేశారు. వీటి మొత్తం విలువ మన భారతీయ కరెన్సీలో 7446 కోట్ల రూపాయలు. బహుళ ఇంటి యాజమాన్య హక్కుల విషయంలో దక్షిణ కొరియా ఆంక్షలు పెడుతున్నా...పెద్ద ఎత్తున పన్నులు విదిస్తున్నా కూడా దీన్ని నియంత్రించలేక పోతున్నారు. 2018 సంవత్సరం నుంచి 2023 జూన్ మధ్య కాలంలో ఈ ముప్పై మంది 8000 ఇళ్ళు కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ స్పెక్యులేటర్స్ గ్రేటర్ సియోల్ ఏరియా లో పెద్ద ఎత్తున ఇళ్ళు కొనుగోలు చేస్తున్నట్లు మిన్ హొంగ్ చుల్ అనే చట్ట సభ సభ్యుడు తన బ్లాగ్ లో పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ఇళ్ళు కొనుగోలు చేసే వారిని కట్టడి చేసేందుకు సియోల్ ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ను గరిష్టంగా 75 శాతానికి పెంచింది. ఈ టాక్స్ 2016 లో 40 శాతంగా ఉంది. రెండుకు మించి ఎక్కువ ఇళ్ళు ఉంటే రకరకాల పన్నులు విదిస్తున్నా కూడా కొనుగోళ్లు మాత్రం ఆగటం లేదు. 2018 నుంచి 2023 జూన్ వరకు సియోల్ లో ఇళ్ల ధరలు 37 శాతం మేర పెరిగాయి.

Next Story
Share it