థర్డ్ వేవ్ మరింత తీవ్రంగా..ఎస్ బిఐ నివేదిక
కరోనా సెకండ్ ఇంకా పూర్తి కాలేదు. కానీ మళ్లీ అప్పుడే థర్డ్ వేవ్ భయాలు. అసలు థర్డ్ వేవ్ వస్తుందా?. లేక ఇది కేవలం భయం మాత్రమేనా?. అయితే దీనిపై కూడా భిన్నమైన వాదనలు ఉన్నాయి. కొంత మంది థర్డ్ వేవ్ ఉంటుందని..ఈ సారి పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తుండగా..కొంత మంది దీనికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు ఏమీలేవని చెబుతున్నారు. ఈ తరుణంలో దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) పరిశోధనా నివేదిక సంచలన విషయాలు వెల్లడించింది.సెకండ్ వేవ్ తరహాలోనే ఇది కూడా తీవ్రంగా ఉండొచ్చని పేర్కొంది.కరోనా బారిన పడిన దేశాల్లో థర్డ్ వేవ్ గరిష్టంగా 98 రోజులు ఉంటుందని పేర్కొంది. అదే సమయంలో సెకండ్ వేవ్ మాత్రం 108 రోజులు అని వెల్లడించింది. అయితే మనం మరింత అప్రమత్తంగా ఉంటే థర్డ్ వేవ్ లో మరణాలను తగ్గించుకోవటానికి అవకాశం ఉందని తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం దేశ జనాభాలో కేవలం 3.2 శాతం మందికిమాత్రమే వ్యాక్సినేషన్ పూర్తి అయిందని..పటిష్టమైన చర్యల ద్వారానే దీన్ని అడ్డుకోగలమని పేర్కొన్నారు.
అధికారిక అంచనాల ప్రకారం 2021 మార్చి నాటికి దేశంలోకరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 1,62,000 ఉంటే ..రెండు నెలల్లోనే మరణాలు రెట్టింపు అయి ఏకంగా 330,000కు పెరిగాయని తెలిపింది. దీంతో సెకండ్ వేవ్ లో మరణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం అవుతుందని తెలిపింది. దేశంలో వైద్య మౌలికసదుపాయల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అందుబాటులో లేక వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వైద్య మౌలికసదుపాయాలను వేగంగా పెంచుకోవటంతోపాటు వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయటం ద్వారా పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వానికి ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రధమ ప్రాధాన్యత కావాలన్నారు. ధర్డ్ వేవ్ లో ఎక్కువ ప్రభావానికి గురయ్యే 12-18 సంవత్సరాల పిల్లలు 15-17 కోట్ల మంది ఉంటారని నివేదికలో తెలిపింది. వీరికి అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.