అమ్మకానికి 34 థాయ్ ఎయిర్ వేస్ విమానాలు
కరోనా దెబ్బకు ప్రపంచంలో అగ్రశ్రేణి విమానయాన సంస్థలు అన్నీ విలవిలలాడుతున్నాయి. ఒకప్పుడు వెలుగు వెలిగిన సంస్థలు అన్నీ ఇప్పుడు డీలాపడి సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. థాయ్ ఎయిర్ వేస్ కూడా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. అందులో భాగంగానే 34 విమానాలను అమ్మకానికి పెట్టింది. పునర్ వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా ఈ విమానాలను అమ్మకానికి నిర్ణయం తీసుకున్నారు. అమ్మకానికి పెట్టిన వాటిలో వైడ్ బాడీ విమానాలతోపాటు చిన్నవిమానాలు కూడా ఉన్నాయి. నిర్వహణ వ్యయాలను తగ్గించుకునేందుకే ఈ విమానాలను అమ్మకానికి పెట్టారు.
34 విమానాల అమ్మకానికి సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను వెబ్ సైట్ ద్వారా స్వీకరిస్తోంది. థాయ్ ఎయిర్ వేస్ నాలుగు ఇంజన్లతో కూడిన ఎయిర్ బస్ ఏ340 విమానాలతోపాటు బోయింగ్ 747 విమానాలు కూడా ఉన్నాయి. పర్యాటకులపైనే ఆధారపడిన ఆర్ధిక వ్యవస్థ థాయ్ ల్యాండ్ ది. కరోనా కారణంగా పర్యాటక పూర్తిగా పడకేసింది. ఇతర దేశాలతో పోలిస్తే థాయ్ ల్యాండ్ కేసులో పరిమిత సంఖ్యలోనే నమోదు అయినా అక్కడ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.