Telugu Gateway
Top Stories

ఇండియా లో ఫస్ట్ షో రూమ్ అక్కడే !

ఇండియా లో  ఫస్ట్ షో రూమ్ అక్కడే !
X

ప్రపంచ నంబర్ వన్ సంపన్నుడు ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా కార్లు భారత్ లో ఫస్ట్ అడుగుపెట్టేది అక్కడే. ఈ కంపెనీ తొలి షో రూమ్ దేశ ఆర్థిక రాజధాని ముంబయి లో ఓపెన్ చేయనుంది. దీని కోసం టెస్లా ముంబయి లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో నాలుగు వేల చదరపు అడుగుల స్పేస్ తీసుకుంది. దీనికి అద్దె నెలకు 35 లక్షల రూపాయలుగా చెపుతున్నారు. అంటే చదరపు అడుగుకు 900 రూపాయల అద్దె అన్న మాట. ముంబయి తర్వాత కంపెనీ తన రెండవ షో రూమ్ ను దేశ రాజధాని ఢిల్లీ లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తొలి దశలో టెస్లా బెర్లిన్ నుంచి కార్లను దిగుమతి చేసుకుని ఇండియా లో విక్రయించే అవకాశం ఉంది అని సమాచారం. అమెరికా లో అయితే టెస్లా కారు కనీస ధర మన కరెన్సీ లో అయితే 35 లక్షల రూపాయలుగా ఉంది. ఇండియాలో టెస్లా బేసిక్ కారు ధర 22 నుంచి 25 లక్షల రూపాయల మధ్య ఉండే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి.

ఇటీవల అమెరికా లో భారత ప్రధాని నరేంద్ర మోడీ తో సమావేశం అయిన తర్వాత ఎలాన్ మస్క్ ఇండియా లో టెస్లా కార్ల అమ్మకాలకు సంబంధించి వేగంగా పావులు కదిపిన విషయం తెలిసిందే. ఈ భేటీ జరిగిన తర్వాతే ఇండియా లో నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో టెస్లా ఇండియాలో తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. కానీ ఇప్పుడు యూనిట్ ఏర్పాటు పై ఎప్పుడు తుది నిర్ణయం తీసుకుంటుంది అనే అంశంపై స్పష్టత లేదు. అయినా సరే దేశంలోని పలు కీలక రాష్ట్రాలు టెస్లా యూనిట్ దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇందులో తెలంగాణ తో పాటు ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఒక్క ఫిబ్రవరి నెలలోనే అమెరికా లో టెస్లా షేర్లు 28 శాతం మేర పతనం అయ్యాయి. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు 293 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ఎలాన్ మస్క్ అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తుండం ..ఆయన చేసే రాజకీయ ప్రకటనలు కూడా టెస్లా పై ప్రభావం చూపించే అవకాశం ఉంది అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story
Share it