ముంబైలో తొలి షో రూమ్ ఓపెన్

ఇండియాలో మొదటి టెస్లా కార్ల షో షో రూమ్ మంగళవారం నాడు ముంబై లో ఓపెన్ అయింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఈ కార్యక్రమంలో పాల్గొని దేశంలోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు స్వాగతం పలికారు. ఈ షో నుంచే భారత మార్కెట్ లోకి టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తెచ్చింది. ఈ కారు ధర అరవై లక్షల రూపాయలు. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ మార్కెట్ లోకి ప్రవేశించేందుకు టెస్లా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కొద్ది నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా లో పర్యటించినప్పుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మోడీతో సమావేశం అయి పలు అంశాలపై చర్చించారు. అప్పటిలో మస్క్ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు ఎంతో సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే. కారణాలు ఏమైనా కూడా అమెరికా తో పాటు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ కార్లపై సుంకాలను భారత ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం గణనీయంగా తగ్గించింది.
ఇది టెస్లా కు ప్రయోజనం చేకూర్చే అంశమే. ముంబై లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో టెస్లా తన షో రూమ్ ను ఏర్పాటు చేసింది. తొలి విడత కంపెనీ రెండు మోడల్స్ కార్లను భారతీయ మార్కెట్ లోకి విడుదల చేస్తోంది. వాస్తవానికి టెస్లా ఇండియా లో కారు తయారీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదన ను కూడా తెర మీదకు తీసుకు వచ్చింది. ఇదే అంశంపై ప్రభుత్వ అధికారులతో కూడా పలు దఫాలు చర్చలు జరిగాయి. కానీ ఇండియా లో టెస్లా యూనిట్ ఏర్పాటు అంశం మాత్రం వాస్తవరూపం దాల్చలేదు. పలు రాష్ట్రాలు టెస్లా యూనిట్ కు కోరినంత భూమితో పాటు ప్రత్యేక రాయితీలు ఇవ్వటానికి కూడా పోటీలు పడ్డారు. కానీ కంపెనీ మాత్రం యూనిట్ ఏర్పాటు విషయంపై తుది నిర్ణయం తీసుకోలేదు. అది ఇప్పటిలో ఉండే అవకాశం కూడా లేదు అని చెపుతున్నారు. ముంబై తర్వాత టెస్లా తన రెండవ షో రూమ్ ను దేశ రాజధాని ఢిల్లీ లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది .



