Telugu Gateway
Top Stories

మోడీజీ...మీరు పెంచాల్సింది గ‌డ్డం కాదు

మోడీజీ...మీరు పెంచాల్సింది గ‌డ్డం కాదు
X

షేవింగ్ కోసం వంద రూపాయ‌లు పంపిన టీ స్టాల్ నిర్వాహ‌కుడు

మ‌హారాష్ట్ర‌కు చెందిన ఓ టీ స్టాల్ నిర్వాహ‌కుడు చేసిన ప‌ని ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. మ‌హారాష్ట్ర‌కి చెందిన ఓ టీ స్టాల్ నిర్వాహ‌కుడు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి వంద రూపాయ‌లు మ‌నీయార్డ‌ర్ చేశారు. అది ఎందుకు అంటే..షేవింగ్ చేయించుకోవ‌టానికి అని. అంతే కాదు.ఈ స‌మ‌యంలో మీరు పెంచాల్సింది గ‌డ్డం కాదు అంటూ కూడా ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు. ప్ర‌ధాని ప‌ద‌విపై త‌న‌కు అత్యంత గౌర‌వం ఉంద‌ని..ఇది ఆయ‌న్ను కించ‌ప‌ర్చాల‌నో..లేక ఇబ్బంది పెట్టాల‌నో తాను ఈ ప‌నిచేయ‌లేద‌న్నారు. వాస్త‌వ ప‌రిస్థితుల‌ను ప్ర‌ధానికి వివ‌రించేందుకే ఈ ప్ర‌య‌త్నం చేశాన‌ని..ఈ వంద రూపాయ‌లు త‌న పొదుపు నుంచి పంపిన‌ట్లు వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం దేశంలో ఉపాధి అవ‌కాశాలు పెంచాల‌ని..వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌తోపాటు దేశంలో వైద్య మౌలిక‌స‌దుపాయాలు పెంచాల‌ని సూచించారు. క‌రోనా క‌ష్టాల నుంచి ప్ర‌జ‌లు ఎంతో ఇబ్బందులు ప‌డుతున్నందున తాను ఈ లేఖ రాసిన‌ట్లు అనిల్ మోర్ తెలిపారు. ప్రధానిని అవమానించడం, బాధపెట్టడం తన ఉద్దేశం కాదని, కరోనాతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనకు తెలియజేసేందుకే ఇలా చేసినట్టు తెలిపారు.అంతేగాక కోవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షలు, లాక్ డౌన్‌తో దెబ్బతిన్న కుటుంబాలకు 30000 రూపాయ‌లు ఆర్థిక సహాయం అందించాలని పీఎంకు రాసిన లేఖలో మోర్ కోరాడు. ది న్యూ ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ స్థానిక ప‌త్రిక‌ల‌ను ఉటంకిస్తూ ఈ ఆస‌క్తిక‌ర క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

Next Story
Share it